మండిపడ్డ మన్మోహన్ : బడ్జెట్ ఎన్నికల తాయిలం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్ ను ప్లాన్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.ఈ ఎనిన్నికలపై ఈ బడ్జెట్ ప్రభావం చూపుతుందని..ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా మాత్రమే ఉందని…ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్ అంటూ దుయ్యబట్టారు. రైతులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే మన్మోహన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం కూడా బడ్జెట్ పై విమర్శలు చేశారు.లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఎన్నికల సమాయత్తాన్ని తలపించిందని సెటైర్లు విసిరారు. గ్రామాల్లో ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తి స్థాయిలో జరగలేదని, పేదలకు పెరిగిన గ్యాస్ సిలండర్ల ధర భారంగా మారిందని, యువతకు ముద్ర రుణాలు ఆశించిన స్థాయిలో లేవని, పేదలకు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేదని అన్నారు.
కాగా..రైతులు, గ్రామీణులు, మధ్యతరగతి వారు రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని గోయల్ తెలిపారు. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని… దేశ అభివృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ అని చెప్పారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్..చిదంబరం విమర్శలు చేశారు.