దేవతావృక్షాలు : వేదమంత్రాలతో చెట్లకు బట్టలు కట్టి పెళ్లి

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 09:50 AM IST
దేవతావృక్షాలు : వేదమంత్రాలతో చెట్లకు బట్టలు కట్టి పెళ్లి

Updated On : March 21, 2019 / 9:50 AM IST

కోల్‌కతా: హిందూ సంప్రదాయంలో ఎన్నో విశేషాలుంటాయి. ప్రకృతిని పూజిస్తాం.. ప్రకృతి నేపథ్యంలో వచ్చే పలు పండుగలను భారతీయులు ప్రత్యేకంగా చేసుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట మనం చెట్లను, జంతువులను, నదులను పూజిస్తాం. అంటే అవి ఎంతో విలువైనవని వాటివల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతోందని నమ్ముతాం. అలాగే ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తిప్రపత్తులతో పూజిస్తాం.రావి చెట్టుకు మర్రి చెట్టుకు పూజలు చేస్తుంటాం. పురాణాలలో వృక్షాలకు విశేషమైన ప్రాధాన్యతలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేద మంత్రాల మధ్య రావిచెట్టుకు..మర్రి చెట్టుకు బట్టలు కట్టి పెళ్లి జరిపించారు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాకు 15 కిలోమీటర్ల దూరంలోని సోడెపూర్‌ గ్రామ పెద్దలు.  

వేదమంత్రోచ్ఛారణల నడుమ ఒక వింత వివాహం జరిగింది. ఈ వివాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ప్రణయ్(మర్రి), దేవరాణి(రావి) అనే చెట్లకు స్థానికులు వివాహం చేశారు. మర్రి చెట్టును  12 ఏళ్ల క్రితం నాటగా, రెండేళ్ల తరువాత దానిపక్కనే  ఆరు అడుగుల దూరంలో రావిచెట్టును నాటారు. ఈ వివాహాన్ని తిలకించేందుకు రెండువేలమంది అతిథులు హాజరయ్యారు. ప్రణయ్‌కు ధోతీ, కుర్తీ ధరింపజేశారు. దేవరాణికి బనారస్ చీర కట్టారు. ఈ సందర్భంగా వివాహ నిర్వాహకులు గౌతమ్ దాస్ మాట్లాడుతూ ‘గోథూళి లగ్నంలో బెంగాలీ సంప్రదాయ రీతిలో ఈ వివాహం చేశామనీ.వీరికి తల్లిదండ్రులుగా గ్రామపెద్దలు ఉన్నారన్నారు. సునీతి సర్కార్, కమర్ వధువు దేవరాణికి తల్లిదండ్రులుగా ఉన్నారు. వరుడు ప్రణయ్‌కు సోమ, సుప్రకాష్ తల్లిదండ్రులుగా వ్యవహరించారు. పెళ్లి అనంతరం భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలిపేందుకే ఈ వివాహాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. 

పురాణాలలో రావిచెట్టు (అశ్వర్థ వృక్షం) ప్రాధాన్యత
సనాతన ధర్మం ప్రకారం వృక్ష జాతికి ఎంతో ప్రాధాన్యతఉంది.ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాదినుండి ప్రశంశింపబడేవి వృక్షజాతి. దీంట్లో  రావిచెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షమని కూడా అంటారు.  అంబరీష మహాముని శాపమువలన శ్రీమహావిష్ణువే సాక్షాత్తు అశ్వత్థ వృక్షము (రావిచెట్టు)గా రూపాంతరం చెందాడరి పద్మపురాణం చెబుతోంది. జ్ఞానాన్ని ప్రసాదించే వృక్షంగా రావిచెట్టుకు పేరుంది. రావి చెట్టుకిందే గౌతముడు బుద్ధుడిగా జ్ఞానాన్ని పొందాడని చెబుతారు.

పురాణాలలో వటవృక్షం (మర్రి చెట్టు) ప్రాధాన్యత
ఇక రెండవది మర్రి చెట్టు. దీనినే వటవృక్షం అని కూడా అంటారు. మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షము అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు (మర్రి చెట్టు ఊడలు కిందికి పెరుగుతాయి)అని అర్థం. ఈ చెట్టును పలు సంస్కృతు(ఆచారం)ల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది. ప్రళయ కాల సమయమునందు యావత్ జగము జలమయము అయినపుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రముపై వటవృక్షమునందు మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది. ఈ అశ్వత్థ వృక్షములు దేవతల నివాస స్థానములు అని అధర్వణ వేదంలో తెలిపారు. ఇలా ఈ రెండు చెట్లకు పురాణాలలో విశిష్ట ప్రాధాన్యత ఉంది.ఈ రెండు చెట్లు వందలాది సంవత్సరాలు జీవిస్తాయి.