Kolkata Fire: కోల్‌కతాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. వెయ్యికిపైగా షాపులు దగ్దం..
కోల్‌కతాలోని ఖిదిర్‌పూర్ మార్కెట్ లో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Kolkata Fire
Kolkata Fire: కోల్‌కతాలోని ఖిదిర్‌పూర్ మార్కెట్ లో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో స్థానికంగా ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో వెయ్యికిపైగా పలు వ్యాపారాలకు చెందిన దుకాణాలు దగ్దమైనట్లు తెలిసింది.
మార్కెట్‌లో వంట నూనెల గోడౌన్లు ఉండటంతోపాటు దుకాణాలలో ఉంచిన దుస్తులు, ప్లాస్టిక్, ఇతర మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 20కిపైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రాతంత్రా అవిశ్రాంతంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో ఇంకా మంటలు అదుపుచేసే ప్రక్రియ కొనసాగుతుంది. సంఘటన స్థలంకు చేరుకున్న అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మంటలు వ్యాపించిన వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చామని, కానీ, వారు సకాలంలో రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అగ్నిమాపక సేవల మంత్రి సుజిత్ బసు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అగ్నిప్రమాదం చాలా భయంకరమైంది. నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేము. మేము మా శక్తి మేరకు ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాం. స్థానికంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.