Opposition Alliance: విపక్షాల కూటమిలో చేరేందుకు BSP ఒకే.. కాకపోతే ఒక్క షరతు!
* మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటే కూటమిలో చేరతాం * మాయావతికి ఉన్నంత గుర్తింపు విపక్ష నేతల్లో ఎవరికీ లేదు: బీఎస్పీ

Mayawati can join oppn alliance if projected as PM candidate says BSP
Opposition Alliance: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలతో కలిసి నితీశ్ కుమార్, కేసీఆర్ లాంటి వారు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. కాగా, దేశంలో ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధమని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీని ఓడించి ప్రజల కోసం ఒక అత్యుత్తమమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము ఎల్లప్పుడూ ముందుటామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ధరమ్వీర్ చౌదరి ప్రకటించారు. అయితే ఈ కూటమిలో తాము చేరేందుకు ఒక్క షరతు విధించారు. తమ పార్టీ సుప్రెమో మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటే కూటమిలో చేరతామని అన్నారు.
మాయావతినే ఎందుకు ప్రధాని అభ్యర్థిగా ప్రటకించాలనే దానికి ఆయన సమాధానం చెప్తూ విపక్ష పార్టీల్లో ఎవరికీ మాయావతికి ఉన్నంత గుర్తింపు లేదని ఆయన అన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత మాయావతిదని, అంతే కాకుండా కాంగ్రెస్, బీజేపీల తర్వాత దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీకి ఆమె అధినేత అని ధరమ్వీర్ చౌదరి పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రధాని అభ్యర్థిపై అయోమయం ఉందని, వాస్తవానికి ఏ పార్టీలోను ప్రధాని స్థాయి అభ్యర్థే లేరని ఆయన అన్నారు.
‘‘అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్, శరద్ పవార్, స్టాలిన్, మమతా బెనర్జీల కంటే మాయావతి చాలా పెద్ద నాయకులు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీఎస్పీకి కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. మాయావతికి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అంతే కాకుండా ఇతరుల తప్పుల్ని మన్నించడంలో ఆమెది చాలా పెద్ద హృదయం. ఒక వేళ అఖిలేష్ యాదవ్ తిరిగి పొత్తుకు వస్తే పూలతో స్వాగతిస్తాం’’ అని ధరమ్వీర్ చౌదరి అన్నారు. యూపీలో అత్యంత వైరి పార్టీలుగా ఉన్న ఎస్పీ-బీఎస్పీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ విడిపోయాయి. వాస్తవానికి ఆ సమయంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఉంటే మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ఒప్పందం ఎస్పీ-బీఎస్పీ మధ్య కుదిరింది. కాకపోతే బీజేపీ అఖండ మెజారిటీ సాధించి ఆ అవకాశం ఇవ్వలేదు.
IAS Roshan Jacob : రోడ్డుప్రమాదంలో గాయపడిన చిన్నారులను చూసి కన్నీరు పెట్టుకున్న ఐఏఎస్ అధికారిణి