హ్యాట్సాఫ్ మేడం పోలీస్: మంచిపని కోసం గుండు కొట్టించుకున్నారు

  • Published By: vamsi ,Published On : September 26, 2019 / 05:11 AM IST
హ్యాట్సాఫ్ మేడం పోలీస్: మంచిపని కోసం గుండు కొట్టించుకున్నారు

Updated On : September 26, 2019 / 5:11 AM IST

పోలీసులంటే రక్షకులు కాదు వేధించేవాళ్లు అని ఇటీవలికాలంలో ప్రజలు ఎక్కువగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడక్కడా మాత్రం కొందరు పోలీసులు అటువంటి మరకలను పోగొట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా కేరళకు చెందిన సీనియర్ మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ (46) ప్రజలకు దగ్గరయ్యేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

స్త్రీలకు సహజంగా జుట్టు మీద ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు వెంట్రుకలు ఊడితే చాలు బాధపడిపోతారు. అటువంటిది జనాలకు దగ్గర అయ్యి పోలీసులంటే గౌరవం రావాలనే ఉద్ధేశంతో మానవతా దృక్పథంతో జనాల అభిప్రాయాలను మార్చేందుకు గుండు కొట్టించుకుంది సదరు అధికారి అపర్ణ. క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ డ్రైవ్‌లో​ భాగంగా స్థానిక పాఠశాలలో ఓ పదేళ్ల చిన్నారిని కలిసిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకుంది.

క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేసేందుకు తన పొడవాటి జుట్టు మొత్తాన్ని దానంగా ఇచ్చేశారు. కీమోథెరపీ తర్వాత జుట్టును పోగొట్టుకున్న బాధితులకు మద్దతుగా తన వంతుగా సాయం చేసినట్లు సదరు ఐపీఎస్ అధికారి వెల్లడించారు. అయితే పోలీసులు జట్టును ఇచ్చేయాలంటే తన సీనియర్‌ అధికారులనుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. కేరళ పోలీసు మాన్యువల్‌లో యూనిఫామ్‌కు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి.

మహిళలు మొత్తం గుండు చేయించుకోకూడదు. దీంతో అధికారుల అనుమతి తీసుకుని ఆమె గుండు కొట్టించుకుంది. కేరళలోని త్రిశూర్‌లో ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు బిడ్డల తల్లి  క్యాన్సర్‌ బారిన పడినపుడు తొలిసారి తన జుట్టును దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు భుజాల వరకు మాత్రమే జట్టు కత్తిరించుకున్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా తన జట్టును గుండు కొట్టించుకుని ఇచ్చేశారు. 

పిల్లలు క్యాన్సర్‌ బారిన పడినపుడు.. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతే, వారి పరిస్థితి మరీ బాధాకరం. తోటిపిల్లల వింతగా చూస్తుంటారు. అవహేళన చేయడం వారి బాధ కలిగిస్తుంది. అందుకే మానసికంగా కృంగిపోయిన అలాంటి చిన్నారులకు సాయం  చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అపర్ణ చెబుతున్నారు.

అందం గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమెకు  కటింగ్‌ చేసిన పార్లర్‌ ఓనర్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాదు 2008లో కూడా ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి, అపర్ణ తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారట.