హనీమూన్ కి తీసుకెళ్లి భర్తని చంపించేసిన భార్య.. సుపారీ కిల్లింగ్.. మొత్తం బయటపడిందిలా..

మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

హనీమూన్ కి తీసుకెళ్లి భర్తని చంపించేసిన భార్య.. సుపారీ కిల్లింగ్.. మొత్తం బయటపడిందిలా..

Updated On : June 11, 2025 / 11:56 AM IST

Couple Missing: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన కొత్త జంట హనీమూన్ కు వెళ్లి అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనమ్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరోకరికోసం గాలిస్తున్నారు.

 

ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు.. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు. మహిళ లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్‌రాంగ్ ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనమ్ సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోనమ్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను యూపీలోని ఘాజీపూర్‌లోని వన్ స్టాప్ సెంటర్‌లో ఉంచారని అన్నారు.

 

అసలేం ఏం జరిగింది..
♦ రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది.
♦ మే 11న రాజా రఘువంశీతో సోనమ్‌కు వివాహం జరిగింది.
♦ 20వ తేదీన హనీమూన్‌ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు.
♦ మే 22న ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్‌ అనే గ్రామానికి చేరుకున్నారు.
♦ అదేరోజు ద్విచక్ర వాహనం అక్కడ పార్క్ చేసి రూట్ బ్రిడ్జిని సందర్శించారు. రాత్రికి నోంగ్రియాట్‌లో బస చేశారు.
♦ మే23వ తేదీన వారు బయటకు వెళ్లి అదృశ్యం అయ్యారు.
♦ మిస్సింగ్ జంట కోసం మేఘాల పోలీసులు విచారణ చేపట్టారు.
♦ జూన్ 2న సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది.
♦ అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
♦ జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో రఘువంశీ భార్య సోనమ్ పోలీసులకు లొంగిపోయింది.
♦ మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులను మేఘాలయలో పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
♦ రఘువంశీని చంపేందుకు భార్య సోనమ్ తమకు సుఫారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.
♦ కాంట్రాక్ట్‌ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్‌ తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
♦ సోనమ్‌ను విచారించిన తరువాత పూర్తి విషయాలు వెలుగులోకి రానున్నాయి.