బీజేపీలో చేరనున్న ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్

Sreedharan దేశంలో పలు మెట్రో రైళ్లకు రూపకల్పన చేసి “మెట్రోమ్యాన్ అఫ్ ఇండియా”గా పేరుపొందిన ప్రముఖ ఇంజినీర్ ఈ. శ్రీధరన్(88) త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.
శ్రీధరన్ కూడా తాను బీజేపీలో చేరుతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమమయంలో శ్రీధరన్ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహించనున్న విజయ్ యాత్రలో భాగంగా శ్రీధరన్ కాషాయ కండువా కప్పుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అయన పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమేనని శ్రీధరన్ చెప్పారు.
ఇక, 140స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అయితే మరో రెండునెలల్లో జరుగనున్న ఎన్నికల్లో ఎలాగైనా పెద్ద సంఖ్యలో సీట్లు సాధించాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.