Microsoft Oyo : ఓయో పంట పండినట్లే.. మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి!!
భారత అతి పెద్ద స్టార్టప్ సంస్థ ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు.

Oyo Microsoft
Microsoft Oyo : భారత అతి పెద్ద స్టార్టప్ సంస్థ ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులతో ఓయో మార్కెట్ విలువ 9 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.
ఓయో పబ్లిష్ ఇష్యూకు వచ్చేందుకు యోచిస్తున్నట్లు ఇటీవలే సంస్థ సీఈఓ రితేశ్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోపే మైక్రోసాఫ్ట్ పెట్టబడుల ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ప్రారంభమైన ఓయోలో సాఫ్ట్ బ్యాంక్‌కు 46 శాతం వాటాలున్నాయి. హోటళ్ల అగ్రిగేటర్‌గా ఉన్న ఈ సంస్థ కరోనా మూలంగా గత కొంత కాలంగా నష్టాల్లో నడుస్తోంది.
దీదీ ఛుగ్జింగ్, గ్రాబ్, ఎయిర్‌బిఎన్‌బి నుంచి ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడులను రాబట్టిన ఓయోపై కరోనా తీవ్రంగా దెబ్బ తీసింది. ఫిడిలటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఇచ్చిన 660 మిలియన్ డాలర్ల ఫండ్‌తో అప్పులు తీర్చే పనిలో పడిన ఓయో, తొందర్లో ఐపిఓకి రాబోతోంది.
ఓలా, ఒబెర్, జొమేటో, స్విగీ ఎలాగైతే కేవలం ఆగ్రిగేటర్లుగా పని చేస్తున్నాయో..ఓయో కూడా జస్ట్ హోటల్ రూమ్స్ కోసం ఇతర భవంతుల యజమానులు, హోటల్స్‌తో టై అప్ పెట్టుకుని ఆగ్రిగేటింగ్ చేస్తుంది. ఇదే సందర్భంలో మన నివాస ప్రాంతాల్లో కూడా టులెట్ బోర్డుల స్థానంలో ఇలా ఓయో హోటల్ బోర్డ్స్ కన్పించడానికి కారణమిదే అని గుర్తించాలి.
హోటల్స్ అంటే ఓయోనే అనే రేంజ్‌లో ఈ సంస్థ చొచ్చుకుపోయేదే కానీ, మధ్యలో కరోనా మహమ్మారి భారీగా దెబ్బ తీయడంతో ప్లాన్లు వర్క్ అవుట్ అవలేదు. అయితే ఇలా భారీ సంస్థల నుంచి పెట్టుబడులు రాబట్టడంతో పాటు ఐపిఓతో కూడా ప్రజలకు చేరువ అవడం ద్వారా తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఓయో పెద్ద స్కెచ్చే వేసినట్లు కన్పిస్తోంది.