47 ఏళ్ల వయస్సులో.. : తల్లీ, కూతురికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం

ప్రతిభకు వయస్సుతో పనేముంది సాధించాలనే పట్టుదలకు లేటు వయస్సు అడ్డా..? కాదు కానే కాదు ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన ఓ మహిళ నిజం చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని థెని జిల్లాకు చెందిన 47ఏళ్ల శాంతి లక్ష్మి అనే మహిళ తన కూతురుతో పాటు తమిళనాడు సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-4 పరిక్షకు హాజరై నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకుంది. ఆమె కుమార్తె ఆరా థెనీమోజీ(28) కూడా అదే పరిక్షలకు హాజరై ఉద్యోగం సంపాదించుకుంది. శాంతిలక్ష్మి ఆరోగ్యశాఖలో ఉద్యోగానికి ఎంపిక కాగా, ఆరా థెనీమోజీకి దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఉద్యోగం దక్కింది. తమిళ సాహిత్యంలో బీఏ.. దాంతోపాటే బీఎడ్ చేసిన శాంతిలక్ష్మి, ఆరా థెనీమోజీలు ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడం కోసం ఏడాది కాలంగా పోటీపరీక్షలకు శిక్షణ తీసుకున్నారు.
వారి ఏడాది కృషికి ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగం దక్కడంపై శాంతి లక్ష్మి మాట్లాడుతూ 2014లో తన భర్త చనిపోయిన తరువాత కుటుంబ భారమంతా తనపైనే పడిందని తెలిపింది. దీంతో తనకు ఉద్యోగం తప్పనిసరి అయ్యిందని వెల్లడించారు. బీఏ తరువాత బీఎడ్ చేశానని తన కుమార్తెతో పాటు కోచింగ్ సెంటర్లో చేరినట్లు తెలిపింది. పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల కారణంగా ఒక్కోసారి తరగతులకు వెళ్లలేకపోయానని, అటువంటి పరిస్థితునల్లో తన కుమార్తె కోచింగ్ క్లాస్ నుంచి వచ్చాక తనకు క్లాసులు చెప్పేదంటూ ఆమె తెలిపింది. ఇక తనకు వచ్చే పోప్టింగ్ తన జిల్లాలోనే రావాలని ఆమె భావిస్తుంది.