Superpowers Illusion: మరో మహిళను పెళ్లాడి.. కన్నకొడుకులనే బలి ఇవ్వాలని ప్లాన్
అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, కన్న తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కొడుకులను బెదిరించి ..

Super Powers
Superpowers Illusion: చిత్తూరులోని మదనపల్లె మర్డర్ నేరం రిపీట్ కాక ముందే బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు ఇద్దరు పిల్లలు. అతీత శక్తులు వస్తాయనే మూడ నమ్మకంతో భర్త సాయంతో మరో మహిళను పెళ్లాడటమే కాకుండా కన్నపిల్లలనే చిత్ర హింసలు పెట్టింది తల్లి. చివరికి ముగ్గురు కలిసి బలి ఇచ్చేందుకు రెడీ అవుతుండగా పిల్లలు పారిపోయి తాత ఇంటికి చేరుకుని నిజాన్ని బట్టబయలు చేశారు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32)లకు దీపక్ (15), కిషాంత్ (6) ఇద్దరు పిల్లలు ఉన్నారు. చీరల వ్యాపారం చేసే రామలింగం.. కొన్ని ఏళ్ల తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలను ఒకే ప్రాంతంలో వేర్వేరు ఇళ్లలో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు మొదటి భార్య ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఆ క్రమంలో రంజితతో చనువు పెరిగింది.
వారి స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన రామలింగం… మీరిద్ద్దరు శివపార్వతిల్లా ఉన్నారని పోల్చేవాడు. కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా దానికీ ఓకే అనేశాడు రామలింగం. ఇంట్లోనే కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, కన్న తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కొడుకులను బెదిరించి చిత్రహింసలకు గురిచేశారు.
స్కూల్‌కు వెళ్లనివ్వకుండా ఇంటి పనులు చేయించడం, శానిటైజర్ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. ఇది చాలదన్నట్లు నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారు. వారి మాటల ద్వారా విషయం గ్రహించిన పిల్లలు ప్రాణభయంతో తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు.
వారంతా కలిసి ఈరోడ్ ఎస్పీ తంగదురైకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు… రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను విచారిస్తున్నారు. పిల్లల అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పిందని హెచ్చరిస్తున్నారు.