డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డకు కరోనా

  • Published By: vamsi ,Published On : April 2, 2020 / 07:07 AM IST
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డకు కరోనా

Updated On : April 2, 2020 / 7:07 AM IST

కరోనా.. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు జనం.. మహమ్మారిలా మారి విరుచుకుపడుతున్న కరోనా(కోవిడ్-19)పై పోరు చేస్తున్న  వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారి సేవలు కొనియాడదగినవే. అయితే కొందరి అలసత్వం మాత్రం కరోనా వ్యాప్తికి కారణం అవుతుంది. 

లేటెస్ట్‌గా ముంబై నగరంలో ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల పసిబిడ్డకు, బిడ్డ తల్లికి కరోనా వైరస్‌ సోకింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి మార్చి 26వ తేదీన ఇంటివద్దే ఓ బిడ్డకు జన‍్మని ఇచ్చింది. పసిబిడ్డ పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమె భర్త తల్లీబిడ్డలను చెంబూర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. 

అయితే అక్కడ సరైన చికిత్స అందట్లేదనే కారణంతో కుర్లా బాబా ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.. ఆ ఆసుపత్రిలోనూ కూడా సరిగ్గా వైద్య సేవలు అందకేపోవడంతో వారిని కస్తూర్భా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు తల్లీబిడ్డలలో కరోనా లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహించారు.

ఆ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, చెంబూర్‌ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలకు వైరస్‌ సోకిందని, వారిని కరోనా పేషంట్‌ బెడ్‌ మీద ఉంచటమే ఇందుకు కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read | క్వారంటైన్‌లో ఉండండి.. అది ఇస్లాంకు వ్యతిరేకం కాదు: తబ్లిగీ మౌలానా