ఎంత కష్టం : ఊరి పేరు మారిన.. జీవితాలు మారటం లేదు

జైపూర్: పేరుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు..ఎవరన్నా పరిచయం అయితే మీ పేరేంటీ అని అడుగుతారు. తర్వాత ఏ ఊరు అంటారు. ఆ ఊరోళ్లు మాత్రం ఊరి పేరు మాత్రం చెప్పరు. అంతేకాదు భయపడిపోతారు కూడా. కొంత మంది సిగ్గుపడతారు. ఎందుకంటే వారి ఊరిపేరు వారికి శాపంగా మారింది. ఎందుకో తెలుసుకుందాం..
రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్ జిల్లా. ఆ గ్రామం పేరు చోర్‌పూర్. 100 కుటుంబాలు. 40 ఏళ్లుగా ఈ గ్రామంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. కాకపోతే చోర్ పూర్ గ్రామం అని చెప్పటానికి మాత్రం భయపడుతున్నారు. ఎవరికైనా చెప్పాలి అంటే సిగ్గుతోపాటు భయం వేస్తుందని అంటున్నారు గ్రామస్తులు. చోర్ పూర్ అనగానే దొంగలుగా చూస్తున్నారని.. అనుమానపు చూపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం పేరులో చోర్ ఉంటే.. గ్రామస్తులు దొంగలేనా అని ప్రశ్నిస్తున్నారు. తమ బాధ అర్థం చేసుకుని గ్రామం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఊరోళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదు :
చోర్ పూర్ గ్రామంలోని యువతులకు యువకులు దొరకటం లేదు.. యువకులను అమ్మాయిలు దొరకటం లేదు. ఇతర గ్రామస్తులు ఎవరూ కూడా ఈ గ్రామంతో సంబంధం పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. ఇది సిగ్గుచేటుగా ఉందని ఆవేదనగా చెబుతున్నారు. పక్క గ్రామాల ప్రజలు చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామం పేరును అధికారికంగా మార్చాలని ఊరంతా గట్టిగా డిమాండ్ చేస్తోంది. వీరిబాధను అర్థం చేసుకున్న అధికారులు ఎట్టకేలకు ఊరిపేరు మార్చారు.. చోర్‌పూర్ కాస్తా ఇప్పుడు సజ్జన్ పూర్ గా మారింది. అయినా పాత వాసనలు పోలేదు. అందరూ చోర్ పూర్ గా మాట్లాడటంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి ఊరు పేరు మారిన.. జీవితాలు మాత్రం మారలేదు అంటున్నారు. రాబోయే కాలంలో అయినా పూర్తిగా ఆ వాసనలు పోవాలని కోరుకుంటున్నారు ఆ గ్రామస్తులు.
Not Chorpura, but Sajjanpura: Rajasthan village wants a new name https://t.co/Y88YLVXSs9 via @TOICitiesNews pic.twitter.com/kj6e3o4iRV
— Times of India (@timesofindia) February 1, 2019