Jammu Kashmir Election Result: జమ్మూకశ్మీర్ సీఎం పదవిపై కీలక ప్రకటన చేసిన ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా
2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని ప్రజలు ఓటు ద్వారా స్పష్టం చేశారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

Farooq Abdullah
Jammu Kashmir New CM: జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. జమ్మూలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మధ్యాహ్నం 2.30గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బీజేపీ 29 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులు 47 స్థానాల్లో ఆధిక్యంలో (కొందరు విజయం సాధించారు) ఉన్నాయి. పీడీపీ నాలుగు, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్సీ, కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ (46)ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు.
ఫలితాల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండటంతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. పదేళ్ల తరువాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని ప్రజలు ఓటు ద్వారా స్పష్టం చేశారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమైందని.. ఒమర్ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.