హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. కొత్త సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

ఖట్టర్ రిజైన్ చేసిన వెంటనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడం.. ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతలు స్వీకరించడం కూడా చకచకా అయిపోయింది.

హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. కొత్త సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

Updated On : March 12, 2024 / 8:02 PM IST

Nayab Singh Saini Oath: లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు నాయబ్‌ సింగ్ సైనీ సీఎంగా ప్రమాణం చేశారు. ఇద్దరు బీజేపీ సభ్యులతో సహా, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఖట్టర్ స్వయంగా సైనీని సీఎం సీట్లో కూర్చొబెట్టి స్వీట్ తినిపించారు.

ఖట్టర్ కు నిరాశ
జననాయక్ జనతా పార్టీ, బీజేపీ మధ్య పొత్తు తెగిపోవడంతో.. మనోహర్ లాల్ కట్టర్ సీఎం పదవికి రిజైన్ చేశారు. దాంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్‌ సింగ్‌ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర నియోజకవర్గ ఎంపీగా.. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

జేజేపీతో విభేదాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ, దాని మిత్రపక్షం జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి ఖట్టర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో..
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 ఎమ్మెల్యేలు.. జననాయక్ జనతా పార్టీకి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 30, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున్ ఖర్గే దూరం.. ఎందుకంటే?

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో 10 స్థానాల్లో విజయం సాధించింది. జేజేపీ పరాజయం పాలైంది. పొత్తులో భాగంగా జేజేపీ పార్టీ రెండు ఎంపీ సీట్లు అడిగితే.. బీజేపీ ఒక్కటి మాత్రమే ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీంతో జేజేపీ పార్టీ 10 స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది. ఇక్కడే పొత్తు చెడిందని సమాచారం. ఆ తర్వాత ఖట్టర్ రిజైన్ చేసిన వెంటనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడం.. ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతలు స్వీకరించడం కూడా చకచకా అయిపోయింది.