ప్రజాస్వామ్యమా.. వారసత్వమా : ఇద్దరు యువరాజులు ఇంటికేనన్న మోడీ

PM Modi in swipe at Rahul Gandhi, Tejashwi Yadav బీహార్ మహిళలకి తాను అండగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ…వంటగది మంటలు మండుతూనే ఉంటాయని బీహార్ మహిళలకు తాను వాగ్దానం చేస్తున్నానని మోడీ అన్నారు. ఆదివారం(నవంబర్-1,2020) ఛప్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…ఇప్పటి నుండి కొన్ని వారాలు జరిగే చాత్ ఉత్సవాల సందర్భంగా ఖర్చుల విషయంలో నా తల్లులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కొడుకు ఢిల్లీలో కూర్చున్నట్లు గుర్తుందా. అతను మీ అన్ని అవసరాలను చూసుకుంటాడు. కరోనావైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ మీ వంటగది మంటలు మండుతూనే ఉంటాయని హామీ ఇస్తున్నా అని మోడీ తెలిపారు.
మోడీ తన ప్రసంగంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో గురించి ప్రస్తావించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వృద్ధ గ్రామ మహిళను ఒక జర్నలిస్టును “మోడీ మీ కోసం ఏమి చేసారు” అనే ప్రశ్న వేయగా… మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల గురించి ఆ మహిళ వివరంగా మాట్లాడి…మన కోసం ఇన్ని చేసిన మోడీకి కాకుండా.. నీకు ఓటు వేయాలని ఆశిస్తున్నారా? అంటూ జర్నలిస్టుకు ఆ వృద్ధురాలు కౌంటర్ ప్రశ్న విసిరింది. కాగా,ఈ వీడియో చూసి తనను ఆకట్టుకుందని మోడీ అన్నారు. బీహార్‌లోని చాలా మంది ఓటర్ల సెంటిమెంట్‌ను ఆమె వ్యక్తం చేశారని మోడీ అన్నారు. ఖచ్చితంగా బీహార్ లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వానిదే అధికారం అని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీయే గెలుస్తుందనే భయంతో విపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయని మోడీ అన్నారు.
కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై విమర్శలు గుప్పించిన మోడీ…ఇది డబుల్ యువరాజ్ కూటమి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ల పేర్లను ప్రస్తావించకుండానే వారిని ఇద్దరు యువరాజులుగా పేర్కొంటూ ప్రధాని విమర్శలు చేశారు. ఇద్దరు యువరాజులు (రాహుల్, తేజస్వి) చేతులు కలిపి సింహాసనంపై కన్నేశారని ప్రధాని వ్యాఖ్యానించారు.తమ “సంబంధిత సింహాసనాలను” రక్షించుకుంటామా లేదా అనేదే రాహుల్,తేజస్వీ ఏకైక ఆందోళన అని మోడీ విమర్శించారు.
గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇద్దరు యువరాజులపై (రాహుల్, అఖిలేశ్ యాదవ్) బీజేపీ విజయం సాధించిందని, ఇప్పుడు బీహార్ లో సైతం ఇద్దరు యువరాజులను బీహారీలు ఇంటిబాట పట్టిస్తారని ప్రధాని మోదీ జోష్యం చెప్పారు. బీహార్ లో విజయం సాధించేది ఎన్డీయే కూటమి అని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో డబుల్ ఇంజన్ (జేడీయూ, బీజేపీ) ప్రభుత్వముందన్న తేజస్వీ విమర్శలకు కూడా ఈ సందర్భంగా ప్రధాని కౌంటర్ ఇచ్చారు. తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తమతో పోటీపడుతున్న ఇద్దరు యువరాజులను బోల్తా కొట్టించడం ఖాయమన్నారు.
బీహార్ లో ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలను ఆరాధించే మహాకూటమికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. సీఎం నితీశ్‌కుమార్, మోడీ బంధువులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా? అని మరో ర్యాలీలో ప్రజలను మోడీ ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీహార్‌లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోడీ గుర్తు చేశారు. ఈ ర్యాలీలో ప్రధానితో పాటు బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.