ఇప్పుడే ఏమీ చెప్పలేం…రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డైరక్టర్

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ ప్రపంచంలో అందరి కన్నా ముందు మంగళవారం(ఆగస్టు-12,2020) రష్యా అధ్యక్షుడు… తమ దేశం కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే రష్యా కరోనా వ్యాక్సిన్ సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఈ వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం, ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అంశాలపై అంచనాకు రావాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేలియా అన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకూడదని, ఇది మంచి రోగనిరోధక శక్తిని అందించాలన్నారు. వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని డాక్టర్ గులేరియా తెలిపారు.
రష్యా ఉత్పత్తి చేసిన టీకాకు స్పుత్నిక్-Vగా నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ వైరస్ వల్ల వచ్చే కరోనాకు వ్యతిరేకంగా స్థిరమైన రోగనిరోధక శక్తిని ఇస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అతడు తన కుమార్తెల్లో ఒకరికి టీకా వేసినట్లు చెప్పాడు. ఈ టీకాకు సంబంధించి ఇంకా తుది పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది.
మాస్కో గమలేయ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఈ ఏడాది చివరినాటికి భారీ ఉత్పత్తికి పెట్టాలని ఆశిస్తున్నట్లు రష్యన్ వ్యాపార సంస్థ సిస్టెమా తెలిపింది. ఈ నెలాఖరులో లేదా సెప్టెంబర్ ఆరంభంలో స్వచ్ఛంద ప్రాతిపదికన వైద్య సిబ్బందికి, ఆతరువాత ఉపాధ్యాయులకు దీన్ని ఇవ్వబడుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. టీకా రెండు మోతాదుల్లో ఇవ్వబడుతుందని, మానవ అడెనోవైరస్ రెండు సెరోటైప్‌లను కలిగి ఉంటుందని, ప్రతి ఒక్కటి కొత్త కరోనావైరస్ ఎస్ యాంటిజెన్‌ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్ మానవ కణాల్లోకి ప్రవేశించి రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయని రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే, హడావుడిగా టీకాను రిజిస్టర్ చేయించడంపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయోగాలు పూర్తి స్థాయిలో నిర్వహించకుండానే టీకాను పంపిణీ కోసం సిద్ధం చేయడం సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ విస్తృతమైన ఉపయోగానికి సిద్ధంగా ఉన్నట్లు తాను ఎలాంటి ఆధారాలను చూడలేదని అన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ టీకాకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
జర్మనీలోని ట్యూబిన్జెన్‌లోని యూనివర్సిటీ దవాఖానకు చెందిన పీటర్ క్రెమ్‌నర్స్ మాట్లాడుతూ…టీకాను ఆమోదించడానికి ముందు సాధారణంగా ఎక్కువ మంది రోగులపై పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.