నా పిల్లి తప్పిపోయింది.. పట్టిస్తే రూ.15వేలు ఇస్తా!

  • Published By: vamsi ,Published On : November 14, 2020 / 08:15 AM IST
నా పిల్లి తప్పిపోయింది.. పట్టిస్తే రూ.15వేలు ఇస్తా!

Updated On : November 14, 2020 / 9:33 AM IST

తప్పిపోయిన తన పిల్లి ఆచూకీ తెలిపితే వారికి 15 వేల రూపాయలను బహుమతిగా ప్రకటించారు నేపాల్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ ఇలా శర్మ. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి రైలు కోసం ఎదురుచూస్తుండగా.. ప్లాట్‌ఫాంపైకి వచ్చే రైళ్లు చేసే శబ్దాలకు భయపడి తన పిల్లి పారిపోయిందని ఆమె వెల్లడించారు.



పచ్చని కళ్ళతో, ముక్కుపై గోధుమ రంగు మచ్చతో పిల్లి చాలా అందంగా ఉంటుందని, పిల్లిని పట్టించినవారికి ఎవరికైనా రూ .15 వేల రివార్డు ఇస్తానని ఆమె ప్రకటించింది.



ఈ మేరకు స్టేషన్ పరిధిలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలలో శర్మ అనేక పోస్టర్‌లను పెట్టించారు. తప్పిపోయిన పిల్లిని కనుగొనడంలో తనకు సహాయం చేయమని ప్రజలను అభ్యర్థించారు. మొదట ఆమె 11వేల రూపాయల రివార్డును ప్రకటించింది. కానీ తరువాత పిల్లి దొరకడం ఆలస్యం అవుతుండడంతో 15వేల రూపాయలకు రివార్డును పెంచింది.



రైలు కోసం రైల్వే స్టేషన్‌లో ఉన్న సమయంలో పిల్లి తప్పించుకోగా.. శర్మ, తన తదుపరి ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం పిల్లిని కనుగొనేందుకు గోరఖ్‌పూర్‌లోనే ఉంటోంది. అయితే “మేము కూడా పిల్లి కోసం వెతుకుతున్నాము, కానీ ఇప్పటి వరకు దానిని కనుగొనలేకపోయాము” అని స్థానికి ఇన్‌స్పెక్టర్ చెప్పారు.