కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం.. కర్నాటకలో టెన్షన్.. టెన్షన్..!

New Strain Virus Cases in Karnataka : పక్క రాష్ట్రం కర్నాటకలో ‘కరోనా కొత్త స్ట్రెయిన్’ గడగడలాడిస్తోంది. బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కొత్త వైరస్ దెబ్బకు కర్నాటక అలర్ట్ అయింది. అంతటా టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. గత 2 వారాల్లో యూకే నుంచి కర్నాటకకు 10,500 మంది వచ్చారు. వారిలో కొంతమందిని పరీక్షించగా ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే నుంచి వచ్చినవారిని గుర్తించే పనిలో కర్నాటక ప్రభుత్వం నిమగ్నమైంది. అనారోగ్య లక్షణాలు ఉన్నప్రతిఒక్కరిని నిశితంగా పరీక్షిస్తోంది.
కొత్త ఏడాదిలోనైనా విద్యా సంస్థలను ప్రారంభించాలని భావిస్తే.. కొత్త వైరస్ భయంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆన్‌లైన్ తరగతులతో పూర్తిస్థాయిలో ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. కొత్త వైరస్ దెబ్బకు విద్యా సంస్థలు జనవరిలో ప్రారంభం కావడం అనుమానమేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 2021 మార్చి, ఏప్రిల్ నెలలో MSLC పరీక్షలు నిర్వహించాలని భావించింది. కానీ, కొత్త కరోనాతో మళ్లీ పునరాలోచన తప్పదని అంటున్నాయి. ఫిబ్రవరిలో సీబీఎస్‌ఈ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ప్లస్ టూ పరీక్షలు జరగాల్సి ఉంది.
కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కేవలం ఇద్దరికే కొత్త వైరస్ సోకిందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. 14 రోజులుగా రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి 10,500 మంది ప్రయాణికులు వచ్చారని, వీరందరినీ గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిపైనే దృష్టిపెట్టామని తెలిపారు. ఈ క్రమంలో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూను విధించారు.