నిర్భయ తండ్రి ఆవేదన: మేం సోనియా అంత గొప్పోళ్లం కాదు

నిర్భయ తండ్రి ఆవేదన: మేం సోనియా అంత గొప్పోళ్లం కాదు

Updated On : January 19, 2020 / 2:13 AM IST

సుప్రీం ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్‌ ఇందిరా జైసింగ్‌ నిర్భయ పేరెంట్స్ కు సూచించారు. దీనికి సమాధానంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇటువంటి సలహాలకు జైసింగ్‌ సిగ్గుపడాలన్నారు. సోనియా గాంధీ అంత పెద్ద మనసు తమకు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్‌ శుక్రవారం ట్వీట్‌ ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను క్షమించినట్లుగా కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు కూడా క్షమించాలని అన్నారు.

తల్లిగా నిర్భయ పేరెంట్స్ బాధను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సబబుకాదని ఇందిరా జైసింగ్‌ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకురాలు నళినీ శ్రీహరన్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని క్షమించిస్తున్నట్లు  ప్రకటించారు. ఫలితంగా ఆ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 

దీనిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. లాయర్ ఇందిరా జైసింగ్‌ సూచనను తిరస్కరించారు. ‘ఏడేళ్లుగా ఈ కేసుపై పోరాడుతున్నాం. రాజకీయ నాయకులం కాదు. సామాన్యులం. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలంగానూ లేవు’ అని సూటిగా చెప్పారు. ఇందిరా జైసింగ్‌ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు.