Mumbai Toll Waiver : ముంబైలోకి ప్రవేశించే ఈ వాహనాలకు టోల్ ఫీజు రద్దు.. ఈ రాత్రి నుంచే అమల్లోకి..!

Mumbai Toll Waiver : త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలో తేలికపాటి మోటారు వాహనాలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.

Mumbai Toll Waiver : ముంబైలోకి ప్రవేశించే ఈ వాహనాలకు టోల్ ఫీజు రద్దు.. ఈ రాత్రి నుంచే అమల్లోకి..!

No toll for cars, SUVs entering Mumbai from tonight

Updated On : October 14, 2024 / 8:31 PM IST

Mumbai Toll Waiver : మహారాష్ట్ర వైపు వెళ్తున్నారా? అయితే వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు ఉండదు. మహారాష్ట్ర ప్రభుత్వం లైట్ మోటార్ వాహనాలపై టోల్ ఫీజు ఎత్తేసింది. ప్రత్యేకించి టోల్ ఫీజు విషయంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైకి వెళ్లేదారిలో 5 టోల్‌ బూత్‌ల వద్ద టోల్ ఫీజు ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. ఈ టోల్ మినహాయింపు నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలో తేలికపాటి మోటారు వాహనాలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం షిండే వెల్లడించారు.

Read Also : World Billionaire Rankings : ప్రపంచ బిలియనీర్ల ర్యాంకులు ఎందుకు మారుతాయంటే? అసలు కారణాలివే!

టోల్ మినహాయింపు దీపావళికి ముందు ముంబైలో వెలుపల ప్రయాణించే ప్రజలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఎక్కువసేపు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సి వస్తుందని ఫిర్యాదు చేసిన ప్రయాణికులకు ఇకపై ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు. ఇప్పుడు దహిసర్, ఎల్‌బిఎస్ రోడ్-ములుండ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే-ములుండ్, ఐరోలి క్రీక్ బ్రిడ్జ్, వాషి అనే ఐదు బూత్‌లలో ఎక్కడ కూడా టోల్ చెల్లించకుండానే ముంబైలోకి అడుగుపెట్టవచ్చు.

తేలికపాటి మోటారు వాహనాలు అంటే.. ప్రధానంగా ప్రయాణీకులు లేదా వస్తువులను తీసుకెళ్లేవి. ఈ కేటగిరీలోని వాహనాలలో కార్లు (హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్ యూవీలు), జీపులు, వ్యాన్‌లు, ఆటో-రిక్షాలు, టాక్సీలు, డెలివరీ వ్యాన్‌లు వంటి చిన్న ట్రక్కులు ఉన్నాయి. ప్రతిరోజూ 6 లక్షలకు పైగా వాహనాలు ముంబైని దాటుతుండగా, వాటిలో 80 శాతం తేలికపాటి మోటారు వాహనాలే ఉన్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో టోల్ ఫీజు రద్దుపై ప్రకటించిన సీఎం ఏక్‌నాథ్ షిండే.. ఈ నిర్ణయంతో సమయం, ఇంధనం ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు.

“ముంబైలోని ఎంట్రీ పాయింట్లలో టోల్ మాఫీ చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అనేక మంది కార్యకర్తలు అదే డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. లాడ్లీ బహిన్, లాడ్లా భాయ్, లాడ్లా రైతులను అమలు చేసినట్లే.. ఇప్పుడు లాడ్లే ప్రయాణికుల పథకాన్ని అమలు చేశాం. ఇది కీలక నిర్ణయం” అని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, శాశ్వత చర్యగా పేర్కొంటూ విపక్షాల వాదనలను సీఎం కొట్టిపారేశారు.

ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలోకి ప్రవేశించే తేలికపాటి మోటారు వాహనాలకు రూ.45, రూ.75 వసూలు చేస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి దాదాజీ దగదు భూసే తెలిపారు. 70వేల వాహనాలు ముంబైకి వెళ్లే భారీ వాహనాలుగా ఆయన చెప్పారు. భారీ వాహనాలు వాటి స్థూల వాహన బరువు 7,500 కిలోల కన్నా ఎక్కువగా ఉంటాయి. ట్రక్కులు, ట్రైలర్‌లు, ట్యాంకర్లు, ఇతర వస్తువుల క్యారియర్‌ల వాహనాలు ఉంటాయి. ముంబైలోకి ప్రవేశించే సమయంలో, దహిసర్ టోల్, ఆనంద్ నగర్ టోల్, వైశాలి, ఐరోలి, ములుండ్‌తో సహా ఐదు టోల్ ప్లాజాలు ఉన్నాయి

టోల్ వసూలు ఎందుకంటే? :
మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అప్పటి మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ముంబైలో 55 ఫ్లైఓవర్‌లను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ల ఖర్చును రికవరీ చేసేందుకు ముందుగా నగరంలోని ప్రవేశాల వద్ద టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వంతెనల నిర్మాణం తుది దశకు చేరుకోగానే టోల్ బూత్‌ల నిర్మాణానికి 1999లో టెండర్లు వేశారు. 2002లో, మొత్తం ఐదు టోల్ బూత్‌లు ప్రారంభించారు. ఆ తర్వాత ముంబైలోని టోల్ బూత్‌లలో టోల్ వసూలు ప్రారంభమైంది.

Read Also : Honor Magic 7 Series : హానర్ మ్యాజిక్ 7 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?