టేస్టీ..టేస్టీ జామకాయ : ఒక్కటీ రూ.100..!!

హర్యానాలోని జీంద్‌లోని కందేలా గ్రామంలో ఒకే ఒక్క జామకాయను రూ. 100కు అమ్ముడవుతోంది. ఏంటీ కశ్మీర్ యాపిల్ పండుకు కూడా లేదు జామకాయకు ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ జామకాయల రుచి చూసిన జనం వాటిని కొనటానికి ఎగజబడి మరీ కొంటున్నారు. క్యూలో నిలబడి మరీ జామకాయల్ని కొనుక్కుంటున్నారు. లొట్టలేసుకుని తింటూ ఆహా..ఏమీ ఈ జామ రుచి అంటూ తెగ ఆస్వాదిస్తున్నారు. పోతే పోయిందిలే వంద రుచి మాత్రం అద్దిరిపోతోంది అంటున్నారు.
ఈ జామ రుచి మాత్రమేకాదు దాని సైజు కూడా విశేషమే. ఒక్కో జామకా 800 గ్రాముల నుంచి కిలో బరువు ఉంటుంది. ఈ జామకాయలను సునీల్ కండెలా అనే రైతు పండిస్తున్నారు. తన పొలంలో రెండు సంవత్సరాల క్రితం థాయిల్యాండ్ రకానికి చెందిన జామ రకాన్ని నాటాడు. ఒక్క సంవత్సరంలోనే పంట చేతికి వచ్చింది. భారీగా విరగకాశాయి. పెద్ద ఎత్తున జామ పంట చేతికి వచ్చింది.
వాటిని మార్కెట్‌కు తరలించారు సునీల్ కండలా. ఈ జామకాయల సైజు..టేస్టు తెలుసుకున్న జనం సునీల్ పండ్ల తోటకు వచ్చి మరీ కొనక్కుని వెళ్తున్నారు. పైగా ఈ జామకాయల్ని ఆర్గానిక్ విధానంలో పండించటంతో మరింత డిమాండ్ వచ్చింది. ఈ జామపండ్లను కొనుక్కోవటానికి ప్రజలు ఎగబడుతున్నారు. ఒక్కొక్కరు 10 కిలోల జామకాయల్ని కొనుక్కుంటున్నారు అంటే ఆ జామకాయల టేస్ట్ ఎలా ఉందో ఊహించుకోండి..ఏంటీ మీక్కూడా నోట్లో నీరు ఊరుతోందా? మరి మీరు కూడా ఆ జామకాయల్ని కొనుక్కోవాలంటే హార్యానా వెళ్లాల్సిందే.