Uttarakhand Tunnel : సొరంగంలో ప్రాణాలు,ఆరు రోజులుగా ఉత్తరకాశీలో కార్మికుల కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కార్మికులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న యత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఆలస్యమవుతోంది.

Uttarakhand Uttarkashi Tunnel

Uttarakhand Tunnel : ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులు కావొస్తున్నా వారిని బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలు సఫలం కావడం లేదు. దీంతో థాయ్‌లాండ్‌, నార్వేకు చెందిన ఎలైట్‌ రెస్క్యూ బృందాలతో పాటు అమెరికన్‌ ఆగర్‌ మిషన్‌ను రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన అధికారులు.. బాధితులకు పైపుల ద్వారా కార్మికులకు ఆక్సిజన్‌, నీరు, ఆహారం అందిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో టన్నెల్‌ కూలిన చోట సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ఈ సొరంగం కూలడంతో 40 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి శిథిలాల తొలగింపు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. ఇప్పటి వరకు 24 శిథిలాలను తొలగించాయి. నాలుగు పైపుల ద్వారా టన్నెల్‌లో ఉన్న కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

Also Read : యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష .. బాధితురాలి అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

కొండ చరియలు విరిగిపడటంతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తరచూ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్‌, నార్వేకు చెందిన ఎలైట్‌ రెస్క్యూ బృందాలను అధికారులు రంగంలోకి దింపారు. స్థానిక సిబ్బంది సహకారంతో ఈ ఎలైట్‌ బృందం టన్నెల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం చేసే ప్రక్రియలో భాగంగా అమెరికర్‌ ఆగర్‌ మిషన్‌ను ఉపయోగిస్తున్నారు అధికారులు. ఇది గంటకు 5 మీటర్ల బండరాళ్లను తొలగిస్తుంది. మరోవైపు.. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 50 మీటర్లకంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలాల గుండా టన్నెల్‌లోకి పంపిస్తున్నారు. వీటి ద్వారా కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Also Read : అచ్చం సల్మాన్ ఖాన్ లాగే ఏడుస్తున్నారు.. మోదీపై ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే… దాదాపు ఐదు రోజులుగా కార్మికులు టన్నెల్‌ లోపలే ఉండిపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు. అంతేకాదు.. భూగర్భంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అపస్మారక స్థితికి కూడా చేరే అవకాశముందని చెబుతున్నారు.