Assembly Elections 2023: అచ్చం సల్మాన్ ఖాన్ లాగే ఏడుస్తున్నారు.. మోదీపై ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పూర్తిగా ఫన్నీ మూడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రపంచ ప్రసిద్ధగాంచిన నటుడని అభివర్ణించారు

Assembly Elections 2023: అచ్చం సల్మాన్ ఖాన్ లాగే ఏడుస్తున్నారు.. మోదీపై ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగుస్తోంది. శుక్రవారం ఉదయమే రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. కాగా, చివరిరోజు సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడుపును బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏడుపుతో పోల్చారు. తేరే నామ్ సినిమాలో సల్మాన్ ఏడ్చినట్టుగానే మోదీ ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా మోదీ పేరును కూడా ‘మేరే నామ్’ అని పెట్టాలంటూ సెటైర్లు విసిరారు.

మోదీ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు
గురువారం రాష్ట్రంలోని సీధి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ‘‘ప్రధానమంత్రి మోదీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయనను ఎవరూ ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆయనే ఏవేవో అనుకుంటున్నారు. కర్ణాటక వెళ్లి తనను తిడుతున్నారని అంటారు, అలాగే మధ్యప్రదేశ్ వచ్చి తనను తిడుతున్నారు అంటారు. ప్రధానమంత్రి ఎప్పుడూ ఇలా ఏడుస్తూనే ఉంటారు. ఆయనను చూస్తుంటే నాకు తేరే నామ్ సినిమా గుర్తొస్తుంది. అందులో సల్మాన్ ఖాన్ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏడుస్తూనే ఉంటారు. ప్రధాని కూడా అలాగే ఏడుస్తున్నారు. అందుకే ప్రధానికి మేరే నామ్ అని పేరు పెట్టాలి’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

అమితాబ్ బచ్చన్ కంటే శివరాజ్ తోపు
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పూర్తిగా ఫన్నీ మూడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రపంచ ప్రసిద్ధగాంచిన నటుడని అభివర్ణించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌పై విరుచుకుపడిన ప్రియాంక గాంధీ.. “ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కనుక సినిమాల్లోకి వెళ్లి ఉంటే, నటనలో అమితాబ్ బచ్చన్‌ను కూడా కొట్టేవారు. కానీ పని విషయానికి వస్తే, ఆయన అస్రానీ పాత్రలో కనిపిస్తారు” అని అన్నారు.