Srinagar-Sharjah Flight : గగనతల నిరాకరణ..శ్రీనగర్ –షార్జా విమానానికి పాక్ ఇబ్బందులు
శ్రీనగర్ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్ ఎయిర్వేస్కు

Plane (1)
శ్రీనగర్ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాకిస్తాన్ ఆంక్షలు విధించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ నిర్ణయంతో విమానం ఉదయపూర్, అహ్మదాబాద్, ఒమన్ మీదుగా షార్జా ప్రయాణించాల్సి ఉంటుంది.
అయితే,కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శ్రీనగర్- షార్జా మధ్య తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించిన పది రోజుల్లోనే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా షార్జా- శ్రీనగర్ మధ్య విమాన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు షార్జా నుంచి బయల్దేరిన విమానం.. షెడ్యూల్ ప్రకారమే బుధవారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సంతోష్ దోకె తెలిపారు.
ఇక, పాక్ చర్య దురదృష్టకరమైనదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. 2009-2010లోనూ పాక్ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడిందన్నారు. ఆ సమయంలో శ్రీనగర్- దుబాయ్ విమానాన్ని పాక్ అడ్డుకుందన్నారు. విమాన సర్వీసులకు మొదట అనుమతి ఇచ్చి.. తర్వాత ఆంక్షలు విధించటం సరికాదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పాక్ గగనతలంపై నుంచి ప్రయాణించడానికి గో ఫస్ట్‌కు అనుమతి లభిస్తుందని ఆశించినట్లు ఆయన ట్వీట్ చేశారు.
పాక్ గగనతలం మీదుగా కశ్మీర్ విమానాలు వెళ్లేందుకు ఆ దేశాన్ని అనుమతి కోరటాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ మరో ట్వీట్ లో తెలిపారు.
ALSO READ Petrol Diesel : దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు