Pakistan Visa to Indians : వైశాఖి పర్వదినం..1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసిన పాకిస్థాన్

Pakistan Issues Visas To 1100 Indians
Pakistan issues Visas to 1100 Indians : పాకిస్థాన్ 1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వెల్లడించింది. త్వరలో రానున్న సిక్కుల కొత్త సంవత్సరం వైశాఖి పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
దీంట్లో భాగంగా భారత్‌కు చెందిన 1100 మంది సిక్కులకు వీసాలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో సిక్కుల పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు భారతీయులకు ఈ అవకాశం కల్పిస్తూ వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వైశాఖి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా భారతీయ సిక్కులు పాక్ కు వెళతారు.
వీసాలు పొందిన వారి తీర్థయాత్ర విజయవంతంగా సాగాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆకాంక్షించింది. పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులను అనుమతించాలన్న ద్వైపాక్షిక ప్రోటోకాల్ అమలులో భాగంగానే వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.
కోవిడ్ -19 ప్రమాదం ఉన్నప్పటికీ..వైసాఖి పర్వదినం సందర్భంగా భారత యాత్రికులను పాక్ దేశంలోని పవిత్ర సిక్కు ప్రదేశాలను సందర్శించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వేడుకల్లో పాల్గొనడానికి శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ పాకిస్థాన్‌కు ‘జాతా’ పంపుతుందని ట్రిబ్యూన్ నివేదించింది. వీసాలు జారి అయిన బృందం ఏప్రిల్ 12 న అత్తారి-వాగా సరిహద్దు మీదుగా భారతదేశం నుండి బయలుదేరి ఏప్రిల్ 22 న తిరిగి రానుంది.