ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని తొలి ప్రశ్న

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. ఈ గందరగోళం మధ్యనే సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో భాగంగా మొదటి ప్రశ్న ఏపీ కి చెందిన టీడీపీ ఎంపీ కేశినేని సంధించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని.. రాష్ట్రంలో భాషా సంస్కృతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును ప్రభుత్వం తప్పని సరిచేసిందని కనుక త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాంతీయ భాషల్ని రక్షించాల్సిన అవసరం ఉందని..రాష్ట్రాల్లో భాషను ప్రమోట్ చేయడానికి సంబంధిత శాఖ ఏం చర్యలు తీసుకుందో వివరించాలని కోరారు.
తెలుగు భాషా పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మానవ వనరుల శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ కేశినేని నాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్, బెనారస్ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. భారతీయ భాషల పరిపుష్టి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పోఖ్రియాల్ తెలిపారు. దీనిలో భాగంగా శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశామని.. 2019,నవంబర్ 13న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. 2011లో హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పామని.. నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.