India-China face off: చైనా అంశంపై చర్చకు పట్టు.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్

India-China face off
India-China face off: లోక్‌సభలో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. ఇటీవల భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై లోక్‌సభలో చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అలాగే, టీఎంసీ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు అందరూ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.
నిన్న లోక్ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా-భారత్ సైనికుల ఘర్షణపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై చర్చ జరపాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాజ్యసభ కొనసాగుతోంది. హైవేలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. స్టార్టప్ ఇండియా గురించి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరణ ఇచ్చారు.
కాగా, ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ఇందులో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని, పార్టీ నేతల బలాన్ని స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రవేశిస్తున్న సమయంలో మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. మన దేశంలో నిర్వహించనున్న జీ20 సదస్సు దేశానికి సంబంధించినదని, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, దాని నిర్వహణలో ఎంపీలు అందరూ పాలుపంచుకోవాలని చెప్పారు.