Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు.. ఎన్నికల ముందు కేంద్రం భారీ కసరత్తు

భారతీయ బాస్కెట్ బ్యారెల్‌ 76 డాలర్లు ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన తర్వాత, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌ను విక్రయిస్తూ లీటరుకు 8-10 రూపాయల వరకు లాభపడుతున్నాయి

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు.. ఎన్నికల ముందు కేంద్రం భారీ కసరత్తు

Updated On : December 12, 2023 / 5:44 PM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పతనమైన అనంతరం.. పెట్రోలు, డీజిల్ ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు ఇంధన ధరల తగ్గింపుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమైన తర్వాత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ విక్రయాలతో లాభాలు గడిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి వినియోగదారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

క్రూడాయిల్ 75 డాలర్లు పడిపోయింది
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం బ్యారెల్‌ 75 డాలర్లుగా ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌ 72 డాలర్లు నడుస్తోంది. భారతీయ బాస్కెట్ బ్యారెల్‌ 76 డాలర్లు ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన తర్వాత, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌ను విక్రయిస్తూ లీటరుకు 8-10 రూపాయల వరకు లాభపడుతున్నాయి. డీజిల్‌ను విక్రయించడం ద్వారా లీటరుకు 3-4 రూపాయలు లాభం వస్తోంది.

రెండో త్రైమాసికంలో రూ.28,000 కోట్ల లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు సాధించిన లాభాలను పరిశీలిస్తే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.13,713 కోట్లు, బీపీసీఎల్ హెచ్‌పీసీఎల్ రూ.8501 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.5827 కోట్లు ఆర్జించాయి. ఈ మూడు ఓఎంసీలు కలిపితే రెండో త్రైమాసికంలో ఈ కంపెనీలు రూ.28,000 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.

ఎన్నికల ముందు భారీ ఉపశమనానికి సన్నాహాలు
ప్రపంచ సంకేతాల దృష్ట్యా, రాబోయే రోజుల్లో, ముడి చమురు ధరలు బ్యారెల్‭కు 75-80 డాలర్ల మధ్య ఉండవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా డీజిల్ ధరలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గవచ్చు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి, అధికార పార్టీకి లాభిస్తుందని అంటున్నారు.