మేఘాలయాలో.. 24 గంటలకు మించి ఉంటే శిక్ష తప్పదు

మేఘాలయ రాష్ట్రంలో నివసించే ప్రజలు కాకుండా.. బయటి వ్యక్తులు 24 గంటలకు మించి ఉండాలనుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. ఎందుకంటే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (MRRSA) సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే..త్వరలో జరుగబోయే శాసనసభా సమావేశాల్లో ఈ చట్టం ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం ఇది అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సోంగ్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఇందులో నుంచి మినహాయింపు ఇచ్చారు.
బయట వ్యక్తులు మేఘాలయాలో ఉండాలంటే..వారు అధికారుల వద్ద వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సులువుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, అబద్దపు సర్టిఫికెట్లు సమర్పిస్తే.. మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు.