PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అసలు కారణం ఇదే.. ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే?
PM Kisan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2వేలు బదిలీ చేశారు. పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan Yojana 19th installment
PM Kisan Yojana 19th Installment : దేశంలోని కోట్లాది మంది రైతుల నిరీక్షణ ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.2,000 బదిలీ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడతను బీహార్‌లోని భాగల్పూర్ నుంచి ప్రధాని మోదీ విడుదల చేశారు.
Read Also : PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్ చేసుకోండి..
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం కింద దేశంలోని 9.8 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో సుమారు 22వేల కోట్లు జమ అయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఏటా రూ.6వేలు అందిస్తుండగా.. ఈ డబ్బు ఒక్కొక్కటి రూ. 2వేలు చొప్పున మూడు వాయిదాలలో బదిలీ అవుతుంది. గతంలో పీఎం కిసాన్ 18వ విడత అక్టోబర్ 2025లో విడుదలైంది. అప్పుడు 9.4 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.20వేల కోట్లు జమ అయ్యాయి.
ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా రూ.6వేలు అందజేస్తారు. ఈ డబ్బును రైతులకు 3 విడతలుగా అందజేస్తారు. ప్రతి విడతకు రూ. 2వేలు ఇస్తారు. సాధారణంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య, మూడవ విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య వస్తుంది.
పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు చాలామంది రైతులకు పడలేదని సమాచారం. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పీఎం కిసాన్ రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలి? అసలు కారణాలేంటి? ఏ విధంగా వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవాలి? మరి ఏం చేస్తే ఆ డబ్బులు తిరిగి మీ అకౌంట్లో జమ అవుతాయి? అసలు ఎవరికి దీని గురించి ఫిర్యాదు చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
రైతులకు ఈ అర్హతలు తప్పనిసరి :
పీఎం కిసాన్ ఆర్థిక సాయం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ సాయాన్ని అందుకోగలరు. కొంతమంది రైతులు అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి రూ. 2వేలు ఆర్థిక సాయం అందకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ అకౌంట్లలో కూడా రూ. 2వేలు పడకపోతే ఈమెయిల్, ఫోన్ ద్వారా మీ ఫిర్యాదులను తెలియజేయొచ్చు.
మీ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేయాలి?
పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి.
మీ వాయిదా స్టేటస్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి?
(pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
‘Beneficiary List’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
‘Get Report’ పై క్లిక్ చేయండి.
ఆ తరువాత లబ్ధిదారుల జాబితా మీకు కనిపిస్తుంది.
ఏదైనా సమస్య తలెత్తితే, హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606 కు కాల్ చేయండి.
ఈ రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రావు :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందలేరు. ఇది కాకుండా, రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే.. వారికి ఈ పథకం ప్రయోజనం లభించదు.
అదే సమయంలో, ఒక రైతు మరొక రైతు నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే.. ఆ రైతులకు కూడా పథకం ప్రయోజనాన్ని పొందలేరు. పీఎం కిసాన్‌కు భూమి యాజమాన్యం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారికి ఈ ప్రయోజనాలు దక్కుతాయి.
ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే? :
- పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు (pmkisan-ict@gov.in) లేదా (pmkisan-funds@gov.in) ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
- హెల్ప్‌లైన్ నెంబర్ (011-24300606) కాల్ చేయడం ద్వారా తమ ఫిర్యాదును చేయొచ్చు.
- హెల్ప్ లైన్ నంబర్లు 155261, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ (1800-115-526)కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
- ల్యాండ్ లైన్ నంబర్లు (011-23381092, 23382401)కి కాల్ చేసి తమ ఫిర్యాదును తెలియజేయొచ్చు.
- హెల్ప్ లైన్ నంబర్ (0120-6025109) కూడా కాల్ చేయొచ్చు.