Prime Minister Narendra Modi : చైనా సరిహద్దుల్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి సంబరాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు....

PM Modi celebrates Diwali

Prime Minister Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు. ‘‘మనకు ధైర్యమిస్తున్న భద్రతా బలగాలతో కలిసి దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో ఉన్న లెప్ఛాకు చేరుకున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో రాశారు.

ALSO READ : Iceland High Alert : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటన ముప్పు…హై అలర్ట్‌ జారీ

అంతకుముందు రోజు ప్రధాని మోదీ తన దీపావళి సందేశంలో దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు! ఈ ప్రత్యేక పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : Hamas commander : గాజా ఆసుపత్రిలో వెయ్యిమందిని బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్ హతం…ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడి

దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో దీపావళి జరుపుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిరకాల సంప్రదాయం. 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాయుధ దళాలతో దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. సైనికుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మోదీ ఒక పనిగా పెట్టుకున్నారు.

2014వ సంవత్సరం నుంచి ప్రధాని దీపావళి వేడుకలు ఎక్కడ జరుపుకున్నారంటే…

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళిని సియాచిన్‌లో భద్రతా బలగాలతో జరుపుకున్నారు. సియాచిన్ గ్లేసియర్ మంచుతో నిండిన పర్వతాలపై వీర జవాన్లు,సాయుధ దళాల అధికారులతో కలిసి మోదీ దీపావళి జరుపుకున్నారు. 1965 యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాలను పురస్కరించుకుని 2015వ సంవత్సరంలో మోదీ పంజాబ్‌లోని మూడు స్మారక చిహ్నాలను సందర్శించారు.

అమరవీరులకు మోదీ వందనం

1965 వయుద్ధం యొక్క 50వ వార్షికోత్సవం, భారత సాయుధ దళాల వీర సైనికులు రక్తాన్ని చిందించి, ఆ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన ప్రదేశాలను మోదీ సందర్శించారు. 1965వ సంవత్సరం యుద్ధంలో డోగ్రాయ్, బార్కీ యుద్ధాల్లో సాధించిన కీలక విజయాలను మోదీ గుర్తు చేసుకున్నారు. 2016వ సంవత్సరంలో చైనా సరిహద్దు దగ్గర సైనికులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. మోదీ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, డోగ్రా స్కౌట్స్, సుమ్‌దోహ్‌లో ఆర్మీకి చెందిన వ్యక్తులతో ప్రధాని సంభాషించారు. చాంగో అనే గ్రామం వద్ద ఆగి స్థానికులతో మోదీ మాట్లాడారు.

సైనిక బలగాలతో గడపటం నాకు కొత్త శక్తి ఇస్తోంది : మోదీ

2017వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌ను సందర్శించారు. ‘‘మన బలగాలతో సమయం గడపడం నాకు కొత్త శక్తిని ఇస్తుంది’’ అని మోదీ చెప్పారు. 2018వ సంవత్సరంలో మోదీ ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో దీపావళి పండుగ చేసుకున్నారు. హర్సిల్ ప్రాంతంలో ఉన్నసైనికులను మోదీ కలిసి మాట్లాడారు. దీని తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించారు.

మంచు పర్వతాలపై సైనికులను కలిసి…

2019వ సంవత్సరంలో మోదీ జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరిలో సైనిక సిబ్బందిని కలిశారు. 2020వ సంవత్సరంలో రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను మోదీ సందర్శించారు. మంచుతో కప్పి ఉన్న పర్వతాలపై సైనికులతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే దీపావళి పూర్తవుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వీర జవాన్లతో దీపావళి వేడుకలు

2021వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో మోదీ దీపాల పండుగను జరుపుకున్నారు. ‘‘నౌషేరాలో ప్రధానమంత్రిగా కాకుండా వారి కుటుంబ సభ్యుడిగా మన వీర జవాన్లతో దీపావళిని జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి కొన్ని ఛాయాచిత్రాలతో పాటు ట్వీట్ చేశారు.

కార్గిల్ సైనికులతో కలిసి…

గతేడాది కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. మోదీ 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించారు. సైనికులను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, భారతదేశం యుద్ధానికి వ్యతిరేకమని, అయితే శాంతిని నిర్ధారించడానికి బలం అవసరమని చెప్పారు.