ఇదీ నిజం : ప్రధాని మోడీ తల్లి ఇంట్లో నెహ్రూ ఫోటో వైరల్

సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతోంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు నెటిజన్లు వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా ప్రధాని మోడీ తల్లి విషయంలోనూ ఇదే జరిగింది. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఇంట్లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటో ఉందని ఓ పిక్ వైరల్ అయ్యింది. ఎన్నికల సమయం కావడంతో ఈ ఫొటో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని తల్లి ఇంట్లో నెహ్రూ పిక్ ఉండటం ఏంటని బీజేపీ శ్రేణులు సహా జనాలు కూడా విస్మయం చెందారు. హీరాబెన్.. నెహ్రూ అభిమాని కాదు కదా అనే సందేహం వచ్చింది. కట్ చేస్తే.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అది ఫేక్ పిక్ అని తెలిసింది. మార్ఫింగ్ చేశారని అర్థమైంది.
ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ పటేల్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను గమనిస్తే ఇంట్లో గోడకు నెహ్రూ ఫొటో ఉన్నట్లు ‘ఐ సపోర్ట్ పుణ్య ప్రసూన్ బాజ్‌పాయ్’ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ గదిలో నెహ్రూ ఫొటో ఉంది. నెహ్రూను విమర్శిస్తారు. కానీ ఇంట్లో ఆయన ఫొటోను తగిలించారు’ అని క్యాప్షన్ ఉంది. అయితే ప్రధాని తల్లి హీరాబెన్ ఇంట్లో నెహ్రూ ఫొటో నిజం కాదు. డిజిటల్‌గా మార్ఫింగ్ చేసిన ఫొటో అది. వాస్తవానికి అక్కడ రాధా సమేతంగా ఉన్న శ్రీ క్రిష్ణుడి ఫొటో ఉంది.
వైరల్ అయిన ఫొటోతో గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ANI మీడియా చేసిన ట్వీట్ కనిపిస్తుంది. ఏప్రిల్ 23న అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న సమయంలో ఆ ఫొటోలు తీశారు. ‘గాంధీనగర్ లో ఉన్న హీరాబెన్ ఇంటికెళ్లి ప్రధాని మోడీ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపట్లో అహ్మదాబాద్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకుంటారు’ అని ANI ట్వీట్‌లో ఉంది. ప్రధాని తన తల్లి హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటుండగా తీసిన మరికొన్ని ఫొటోలు అక్కడ కనిపిస్తాయి. ఆ ఫొటోలను కొందరు పనిగట్టుకుని డిజిటల్ మార్ఫింగ్ చేశారు. ప్రధాని తల్లి ఇంట్లో నెహ్రూ ఫోటో పెట్టి ఏదో సాధించాలని చూశారు. మొత్తంగా హీరాబెన్ ఇంట్లో నెహ్రూ ఫొటో ఉందన్నది నిజం కాదని తేలింది. రాధా సమేత క్రిష్ణుడి ఫొటోని నెహ్రూ ఫొటోగా డిజిటల్ మార్ఫింగ్ చేశారని స్పష్టమైంది.
Gujarat: Prime Minister Narendra Modi met his mother at her residence in Gandhinagar today. He will cast his vote in Ahmedabad, shortly. pic.twitter.com/CUncTSpBTt
— ANI (@ANI) April 23, 2019