PMLA case : యస్ బ్యాంక్ ఫౌండర్ కి నో బెయిల్

Rana Kapoor బెయిల్ మంజూరు చేయాలంటూ యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో 2020 మార్చిలో రాణాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని వివిధ సెక్షన్ల కింద రాణా కపూర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) సంస్థకు రుణం మంజూరు చేసినందుకు రాణాకపూర్, ఆయన సతీమణి, ముగ్గురు కూతుళ్లకు రూ.600 కోట్ల ముడుపులు అందాయన్న అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
గతేడాది జూలైలో రాణా కపూర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జస్టిస్ పీడీ నాయక్ సారథ్యంలోని సింగిల్ బెంచ్ ముందు జిరగిన విచారణకు రాణా కపూర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తన క్లయింట్.. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి ముడుపులుగా రూ.600 కోట్లు తీసుకోలేదని వాదించారు.
ఈడీ తరఫు న్యాయవాది హితేన్ వెనెగావోంకర్ వాదిస్తూ.. ఈ బ్యాంకుకు సహ యజమానులుగా రాణా కపూర్ కూతుళ్లు ఉన్నారని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వివిధ కంపెనీలకు భారీగా మంజూరు చేసిన రుణాలకు ముడుపులుగా రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రూ.4,300 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ అంశంపై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది.