ప్రగ్యా సింగ్ సాధ్వి కాదు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రగ్యా సింగ్ ఠాకూర్ సన్యాసిని కాదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ విమర్శించారు. ప్రగ్యా తన బావతో కలిసి ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ ఘర్ లో నివసించే సమయంలో టీషర్టు, జీన్స్ ప్యాంట్ ధరించి బైక్ పై తిరిగేదని, ఒకరిని కత్తితో కూడా పొడిచిందని సీఎం తెలిపారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు. చిన్ననాటి నుంచే నేరస్వభావం ఆమె సొంతమంటూ ప్రగ్యాను ఆయన విమర్శించారు.
2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారని అన్నారు. అలాంటి వ్యక్తి నేడు సన్యాసినిగా చెప్పుకొంటూ తిరుగుతున్నారని విమర్శించారు. అయితే భూపేష్ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు హితేష్ బాజ్ పాయి ఖండించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇటువంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు.