రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ముంబైలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజ్‌గృహాలోకి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది దుండగులు చొరబడి వరండాలో ఉన్న పూల కుండీలను చిందరవందరగా పడేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు.
అక్కడ పని చేసే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశరాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేసి..దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ఆయన వారసులు ప్రకాష్ అంబేద్కర్, ఆనందరాజ్ అంబేద్కర్ ఖండించారు. సీసీ ఫుటేజీలను కూడా ధ్వంసం చేసి పారిపోయినట్టుగా తెలుస్తోంది. సీసీ పుటేజీలను కూడా ధ్వంసం చేసి పారిపోయారు అంటే దుండగులు కావాలనే ప్లాన్ తోనే చేశారని వారు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ముంబైలో స్థిరపడిన తరువాత 1930లో ఈ మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇది హెరిటేజ్ మ్యూజియంతో పాటు స్మారక చిహ్నంగా అలరారుతోంది. ఈ భవనంలో మొదటి అంతస్తు వరకు అంబేద్కర్ వ్యక్తిగత వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. మిగితా రెండు అంతస్తులు ఆయన వారసులు వినియోగించుకుంటున్నారు.
Read Here>>డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కోవిడ్ పరీక్షలకు అనుమతి