సైనికుల శౌర్యం…దేశం సురక్షితం : కశ్మీర్ లో సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2019 / 12:32 PM IST
సైనికుల శౌర్యం…దేశం సురక్షితం : కశ్మీర్ లో సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ

Updated On : October 27, 2019 / 12:32 PM IST

పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో  సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సైనికులకు స్వయంగా తన చేతులతో స్వీటు తినిపించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఆర్మీ సేవలను ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు. సైనికుల అప్రమత్తత మరియు శౌర్యం మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతుందని మోడీ అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆర్మీ ధైర్యసాహసాలు అద్భుతమని,చాలా మందిని విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి కాపాడారని,పబ్లిక్ ప్రాపర్టీని నిశనం కాకుండా కాపాడారని మోడీ అన్నారు.

సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యల గురించి కూడా వారితో మాట్లాడారు. మన ధైర్యవంతులైన సైనికులతో జరుపుకున్న ఈ దివాళీ చాలా తియ్యనైనదని మోడీ అన్నారు. ప్రధాన మంత్రితో కలిసి దీపావళి సంబరాలను జరుపుకోవడం గర్వకారణంగా సైనికులు భావిస్తున్నారు. ఆయన వచ్చి, తమతో కలిసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషం కలిగించిందని, గర్వపడుతున్నామని సైనికులు తెలిపారు.

రాజౌరీ నుంచి తిరుగుప్రయాణంలో పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ స్టేషన్ ని మోడీ సందర్శించారు. ఇటీవల పఠాన్ కోట్ బేస్ లోకి తీసుకొచ్చిన అపాచీ అటాక్ హెలికాఫ్టర్ లను మోడీ పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను మోడీకి వాయుసేన అధికారులు వివరించారు.

2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్నారు. తొలి ఏడాది ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుధ్ధ క్షేత్రంగా పేరు పొందిన సియాచిన్ లో చేసుకున్నారు. 2015 లో పంజాబ్ సరిహద్దుల్లో,2016 లో హిమాచల్ ప్రదేశ్ లోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళజవాన్లతో జరుపుకున్నారు. 2017 లో జమ్మూ కాశ్మీర్ లోని గురేజ్ వద్ద, 2018 లో ఉత్తరాఖండ్ లో భారత్ చైనా సరిహద్దుల్లోని ఐటీబీపీ సిబ్బిందితోనూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ ఏడాది(2019)లో జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో భారత సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఇవాళ ఉదయం ప్రధాని పర్యటించిన రాజౌరీలో భారత సైన్యంపై పాక్ కాల్పులకు తెగబడింది.భారత జవాన్లు పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొట్టారు.