ఆలయంలో దొరికిన బంగారు నిధి.. ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒప్పుకోని గ్రామస్తులు

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో గర్భగుడిలో తవ్వకాల సమయంలో మొత్తం 561గ్రాముల బంగారు నగలు బయట పడ్డాయి. ఆ నిధికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవగా.. ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి ఆభరణాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ప్రభుత్వ అధికారులు నిధిని అప్పగించాలని అధికారులు పట్టుబట్టగా.., గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. అయినా అధికారులు ప్రయత్నించడంతో.. గ్రామస్తులు రోడ్డు దిగ్బంధనానికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెలరేగింది.
కుజాంబేశ్వర ఆలయం ఉత్తరామూర్ మునిసిపాలిటీలోని 14వ వార్డులో ఉంది. ఈ ఆలయం కులోతుంగ చోళII పాలనలో నిర్మించబడింది. చాలా పురాతనమైన ఈ ఆలయంకి జిల్లాలో చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ, కుజాంబేశ్వర ఆలయం చాలా కాలం పాటు నిర్వహణలోపం కారణంగా మరమ్మతు స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఆలయం ఖజానా నియంత్రణలో లేనందున, ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు రోజూ ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనలు చేయిస్తూ.. ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలోనే గ్రామస్తులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, వారి సహాయంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం అవగా.. అందుకోసం ఆలయంలో గణపతి హోమం, బాలాలయం నిర్వహించారు. తరువాత ఆలయ పునరుద్ధరణ పనుల కోసం శిధిలాలను తొలగించి గుంటలు తవ్వారు. ఈ సందర్భంలోనే ఆలయ ప్రవేశద్వారం వద్ద సుమారు 7అడుగుల లోతు వరకు కందకం తవ్విన తర్వాత అక్కడ ఒక పెట్టె కనిపించింది. దానిని తెరిచి చూడగా.. అందులో కిలోకు పైగా పురాతన బంగారు నాణేలు మరియు అనేక లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అవి ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులు పట్టుబట్టారు. ఆగ్రహించిన స్థానికులు ఆర్‌డీఓ సహా అధికారులను ముట్టడించారు. ఆలయ భాధ్యతలు ఇప్పటివరకు పట్టించుకోని ప్రభుత్వం నిధిని తీసుకోవడానకి ఎలా అర్హత పొందుతుంది? అని ప్రశ్నించారు.
అయితే గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం చివరకు ఫలించింది. ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని వాదించిన గ్రామస్తులు.. ఆలయం నిర్మించడానికి ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్‌తో.. పాడు ఆలయం పునర్నిర్మానం పూర్తయిన తర్వాత ఆభరణాలను ఆలయానికే అందించాలనే అంగీకారంతో.. ప్రజలు ఆభరణాలను ప్రభుత్వ అధికారులకు అందజేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించగా.., ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని, వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.