Pune Court: చిన్నారి కస్టడీ కేసు.. తల్లికి షాకిచ్చిన పూణే కోర్ట్.. సంచలన తీర్పు
'తల్లి' అనే హోదా ఉన్నంత మాత్రాన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పలేమని పుణే కోర్టు(Pune Court) స్పష్టం చేసింది.
Pune court sensational verdict regarding child custody dealing a shock to the mother.
- తల్లి బాధ్యతారాహిత్యంపై కోర్టు ఆగ్రహం.
- చిన్నారి కస్టడీ తండ్రికి అప్పగింత.
- పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యం.
Pune Court: కుటుంబ వ్యవస్థలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. సాధారణంగా చిన్న పిల్లల కస్టడీ విషయంలో న్యాయస్థానాలు సహజంగానే తల్లి వైపు మొగ్గు చూపుతుంటాయి. అయితే, కేవలం ‘తల్లి’ అనే హోదా ఉన్నంత మాత్రాన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పలేమని పుణే కోర్టు(Pune Court) స్పష్టం చేసింది. వైవాహిక బాధ్యతలను విస్మరించి, కుటుంబంలో అశాంతికి కారణమయ్యే వాతావరణం పిల్లల మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలోనే ఒక చిన్నారి కస్టడీ కేసును విచారించిన న్యాయస్థానం, భార్య ప్రవర్తనను తప్పుబడుతూ బాలుడి సంరక్షణ బాధ్యతలను తండ్రికి అప్పగిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ కేసులో భర్త, అత్తమామల పట్ల క్రూరంగా ప్రవర్తించే మహిళకు పిల్లల కస్టడీ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. నిరంతరం గొడవలు జరిగే వాతావరణంలో చిన్నారులు ఆరోగ్యకరంగా పెరగలేరని, చట్టం ప్రకారం పిల్లల సర్వతోముఖాభివృద్ధే అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విషయమని న్యాయస్థానం గుర్తుచేసింది. బాధ్యతారహితంగా ప్రవర్తించే తల్లి వద్ద ఉంటే పిల్లాడి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, బాలుడి సంరక్షణకు తండ్రే అర్హుడని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా తల్లికి కస్టడీని నిరాకరించిన కోర్టు, ఆమెకు కేవలం నిర్ణీత సమయాల్లో మాత్రమే కుమారుడిని చూసుకునేందుకు అనుమతినిచ్చింది. విడిపోయిన భాగస్వామిపై పగ తీర్చుకోవడానికి పిల్లలను ఒక ‘ఆయుధం’లా వాడుకోలేరంటూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పిల్లల హక్కులు, వారి మానసిక వికాసమే పరమావధిగా సాగిన ఈ తీర్పు, కస్టడీ కేసుల్లో కేవలం జెండర్ (లింగం) కంటే పిల్లల సంక్షేమమే అత్యున్నతమైనదనే విషయాన్ని మరోసారి నిరూపించింది.
