వావ్.. రాష్ట్రపతి భవన్లో పెళ్లి.. చరిత్రలో నిలిచిపోతున్న ఈ అమ్మాయి ఫుల్ డిటెయిల్స్..
గతంలో ఎప్పుడూలేని విధంగా ఓ మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవనం వేదిక కానుంది. ఈనెల 12న భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో..

Rashtrapati Bhavan,
Historic Wedding At Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతుంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఓ మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవనం వేదిక కానుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి(పీఎస్వో)గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని వివాహానికి భవన్ లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. దీంతో ఈనెల 12న భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో సదరు ఉద్యోగిని వివాహం జరగనుంది. ఇంతకీ.. రాష్ట్రపతి భవన్ లో పెళ్లిచేసుకోబోయే ఉద్యోగిని ఎవరు.. ఆమెతో పెళ్లిపీటలపై కూర్చునే వ్యక్తి ఎవరు.. ఎందుకని రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆ ఉద్యోగిని వివాహాన్ని భవనంలో జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో)గా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహం చేసుకోనుంది. జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్ తో పూనమ్ గుప్తా వివాహం జరగనుంది. వరుడు కూడా సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం రాష్ట్రపతి భవన్ లో జరిగేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అయితే, భద్రతాకారణాల దృష్ట్యా ఈనెల 12వ తేదీన జరిగే వారి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి.
పూనమ్ గుప్తా స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని శ్రీరామ్ కాలనీ. ఆమె తండ్రి రఘువీర్ గుప్తా. ఆయన నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. పూనమ్ గుప్తా గణితంలో గ్రాడ్యుయేట్, ఆంగ్ల సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. ఆమె బీఈడీ పూర్తి చేశారు. 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. అనంతరం సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పోస్టింగ్ లభించింది. విధుల పట్ల పూనమ్ అంకితభావం, వృత్తి నైపుణ్యం, ఆమె ప్రవర్తన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆకట్టుకుంది. ఆమె పెళ్లి గురించి తెలుసుకున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్ లో వివాహం చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
2024 గణతంత్ర దినోత్సవ కవాతులో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు. అయితే, పూనమ్ – అవ్నీశ్ కుమార్ ల వివాహం రాష్ట్రపతి భవనంలో జరుగుతుండటం పట్ల వారి వివాహం గురించి దేశ వ్యాప్తంగా చర్చజరుగుతుంది.