రత్న భండార్ తెరిచే సమయంలో అనూహ్య ఘటన.. సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ

1978 తర్వాత రత్న భాండాగారం ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యింది. రత్న భండార్ లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రత్న భండార్ తెరిచే సమయంలో అనూహ్య ఘటన.. సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ

Updated On : July 14, 2024 / 7:17 PM IST

Opening of Ratna Bhandar : దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపులను తెరిచారు. అయితే, తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎస్పీ సొమ్మసిల్లి పడిపోయినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. తర్వాత మళ్లీ కోలుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అనుమతిచ్చారు. కలెక్టర్, హైలెవెల్ కమిటీ పర్యవేక్షణలో తలుపులు తీశారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీసింది కమిటీ.

1978 తర్వాత రత్న భాండాగారం ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యింది. రత్న భండార్ లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టెల్లో వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. సంపదను తరలించేందుకు 6 ప్రత్యేక పెట్టెలను ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిని ఇత్తలితో తయారు చేసినట్లు చెప్పారు. నిధులను లెక్కించేందుకు చర్యలు చేపడుతున్నారు. 16 మంది కమిటీ సభ్యులు సంపదను లెక్కించబోతున్నారు.

రత్న భాండాగారం మూడు తెలుపులు తెరిచారు. అయితే, మూడో తలుపు తెరిచే సమయంలో కొంత ఇబ్బంది పడినట్లు సమాచారం. చివరికి తమ దగ్గరున్న ఎక్విప్ మెంట్, గునపాల సాయంతో మూడో తలుపుని సిబ్బంది తెరవగలిగారు. ఈ క్షణం కోసమే యావత్ దేశం ఆసక్తిగా, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. 46ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారులు భాండాగారం తెరిచారు. రహస్య గదిలో లభించిన నిధిని మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పుడు ఆ భాండాగారంలో ఎంత సంపద ఉందనేది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

Also Read : తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మూడు తలుపులు..