Medicine Price: అజిత్రోమైసిన్, ఇబుప్రోఫెన్ సహా దేశంలో 900 ఔషధాల ధరలు పెరిగాయ్..
ఎన్‌పీపీఏ (National Pharmaceutical Pricing Authority) దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్లు ప్రకటించింది.

Medicine
Medicine Price Hike: నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతీయేటా ధరలు అంతకంత పెరగడమే కానీ తగ్గే ప్రసక్తే లేకుండా పోతోంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ధరల పెంపు ట్యాబ్లెట్ల వంతు వచ్చింది. సామాన్య ప్రజల నుంచి ధనికుల వరకు ఎక్కువగా వినియోగించే పెయిన్ కిల్లర్స్ మందులతో పాటు పలు రకాల యాంటీ బయోటిక్స్ టాబ్లేట్స్ .. ఇలా దేశ వ్యాప్తంగా 900 రకాలకుపైగా ఔషధాల ధరలు పెరిగాయి.
ఎన్‌పీపీఏ (National Pharmaceutical Pricing Authority) దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్లు ప్రకటించింది. ఇందులో ఎక్కువగా యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, మధుమేహానికి సంబంధించిన మందులు ఉన్నాయి. వార్షిక హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) మార్పు ప్రకారం ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తయారీదారులు ఔషధాల ధరలను సవరించుకోవచ్చు. 2023తో పోలిస్తే 2024 క్యాలెండర్ సంవత్సరంలో నమోదైన డబ్ల్యూపీఐ ఆధారంగా ఔష ధరలను గరిష్ఠంగా 1.74శాతం వరకు ధరలు పెరిగినట్లు ఎన్‌పీపీఏ పేర్కొంది.
సవరించిన ధరల ప్రకారం కొన్ని..
♦ యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ 250ఎంజీ ఒక్కో టాబ్లేట్ ధర రూ.11.87, అదేవిధంగా 500 ఎంజీ ధర రూ.23.97కు పెరిగింది.
♦ అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ కలిగిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ ధర ఒక్కో ఎంఎల్ గరిష్ఠ ధరను రూ.2.09గా నిర్ణయించారు.
♦ డైక్లోఫెనార్ (పెయిన్ కిల్లర్) టాబ్లెట్ గరిష్ఠ ధర రూ.2.09గా నిర్ణయించారు.
♦ ఇబ్రూఫెన్ 200ఎంజీ ఒక టాబ్లెట్ ధర రూ.0.72 కాగా.. 400ఎంజీ టాబ్లెట్ ధర రూ.1.22కు పెరిగింది.
♦ డయాబెటిస్ మందులు (డపాగ్లిఫ్లోజిన్ + మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్): ఒక టాబ్లెట్ దాదాపు రూ. 12.74.
♦ ఎసిక్లోవిర్ (యాంటీవైరల్) 200ఎంజీ టాబ్లెట్ కు రూ.7.74 అదేవిధంగా 400 ఎంజీ టాబ్లెట్ కు రూ.13.90కు చేరింది.
♦ హైడ్రాక్సీక్లోరోక్విన్ (మలేరియా నిరోధకం): 200 ఎంజీ టాబ్లెట్ కు రూ.6.47కు.. అదేవిధంగా 400 ఎంజీ టాబ్లెట్ కు రూ.14.04గా చేశారు.
♦ డయాబెటిస్ తోపాటు గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ఔషధాల ధరలను స్వల్పంగా పెంచి వాటి గరిష్ఠ పరిమితులను NPPA తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.