Pune Study : కోవిడ్ సోకినవారిలో దీర్ఘకాల రోగ నిరోధక శక్తి..రీ ఇన్ఫెక్షన్ చాలా అరుదు

కరోనా వైరస్ సోకి కోలుకున్న వాళ్లకి మళ్లీ కరోనా సోకే(reinfection)అవకాశాలు చాలా అరుదు అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

Pune Study : కోవిడ్ సోకినవారిలో దీర్ఘకాల రోగ నిరోధక శక్తి..రీ ఇన్ఫెక్షన్ చాలా అరుదు

Virus

Updated On : July 9, 2021 / 8:19 PM IST

Pune Study కరోనా వైరస్ సోకి కోలుకున్న వాళ్లకి మళ్లీ కరోనా సోకే(reinfection)అవకాశాలు చాలా అరుదు అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో సహజ ఇమ్యునిటీ దీర్ఘకాలం ఉండే అవకాశముందని అధ్యయనం తెలిపింది.

పూణేలోని డాక్టర్ డీవై పాటిల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి చెందిన ఎపిడమాలజిస్టులు మరియు కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుల బృందం..కోవిడ్ నుంచి కోలుకున్న 1018 పూణే వాసులను గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ట్రాక్ చేస్తూ వచ్చింది. ఈ 9 నెలల అధ్యయన కాలంలో..మొత్తం 1018లో కేవలం 13 మంది మాత్రమే రెండోసారి కోవిడ్ బారిన పడ్డారు. అంటే రీ ఇన్ఫెక్షన్ రేటు కేవలం 1.2శాతంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రెండోసారి కోవిడ్ సోకిన 13మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయి మరియు వారు చాలా త్వరగా పూర్తిగా కోవిడ్ నుంచి కోలుకున్నారు.

అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు కలిగి ఉండి..తక్కువ సంఖ్యలో కోవిడ్ డోసులు కలిగి ఉన్న దేశాలకు ఇటువంటి అధ్యయనాలు ముఖ్యమైన సూచనలు తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ సోకనివారికి-సహజ ఇమ్యూనిటీ లేని వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రియారిటీ ఇవ్వడం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రభుత్వం హార్డ్ ఇమ్యూనిటీని త్వరగా సాధించేందుకు సాధ్యపడుతుందని తెలిపారు.

సహజ ఇమ్యూనిటీ వల్ల కోవిడ్ నుంచి కోలుకున్న వారిని వ్యాక్సిన్ పోగ్రామ్ క్యూలో చివర ఉంచాలని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎపిడమాలజిస్ట్ అమితవ్ బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సీరో సర్వే,తాజాగా PMR సర్వేతో కలిపి..70-80శాతం మంది జనాభాలో ఐజీసీ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాబట్టి మనం మిగిలిన 20-30శాతం మందిపై ఫోకస్ పెట్టాలని దీని వల్ల చాలా వనరులు ఆదా అవుతాయని,అదే సమయంలో 100 శాతం జనాభా స్థాయి ఇమ్యూనిటీని సాధించేందుకు సాయపడుతుందని బెనర్జీ తెలిపారు.