త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ…ఏపీ,తెలంగాణకు ఛాన్స్

త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో పలువురు మంత్రులు ఒకటి కన్నా ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇది వారిపై అధిక భారం మోపుతుందని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది వారాల్లోనే కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది..వచ్చే నెల నుంచి 3దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కోల్పోయిన వారిలో కొంతమందికి కేబినెట్లో కీలక మంత్రిత్వశాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి కేబినెట్ విస్తరణ కానుంది. వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కీలక నేతలను పదవులు వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కమలదళం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా, బీజేపీలో కీలక నేతలైన రామ్ మాధవ్, అనిల్ జైన్, సరోజ్ పాండే, మురళీధర్ రావు,ఉమా భారతి, ఓం మాథుర్, ప్రభాత్ ఝా, వినయ్ సహస్రబుద్దే, శ్యామ్ ఝా, అవినాశ్ రాయ్ ఖన్నా వంటి వారి పేర్లు శనివారం పార్టీ కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డజను మందికిపైగా సీనియర్లను పక్కనపెట్టడం ఒకింత సంచలనమే. అయితే, నడ్డా జట్టులో చోటు కోల్పోయిన సీనియర్లకు మోడీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.