లోక్‌సభ ముందుకు రిజర్వేషన్ బిల్లు

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 09:42 AM IST
లోక్‌సభ ముందుకు రిజర్వేషన్ బిల్లు

ఢిల్లీ: అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్‌కు సంబంధించి లోక్‌సభలో 124వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలపనున్నాయి. సవరణలు కూడా చేయనున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2/3 వంతు మెజారిటీ కావాలి.

దేశంలో కులాల ప్రాతిపదికన 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 49.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ లబ్దికోసమే బీజేపీ రిజర్వేషన్ల ప్రతిపాదన తీసుకొచ్చిందని విపక్షాలు అంటున్నాయి.