పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లుగా డౌన్‌ఫాల్.. కారణాలేంటి?

నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్‌లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్‌లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది.

Rise and fall of the Congress Party: వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఇది.. స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు.. అప్రతిహత విజయాలతో అధికారం.. ఎంతో శక్తివంతమైన పార్టీగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ గత కొన్నేళ్లుగా పరాజయాలే కేరాఫ్ అడ్రస్‌గా పడిపోతోంది. 1985 నుంచి 2014 వరకు దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత భవిష్యత్‌పై క్లారిటీ లేకుండా గమ్యం లేని ప్రయాణం చేస్తోంది.

ఒక్కసీటు కూడా పెరగలేదు
దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో.. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా 364 సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఆ తర్వాత 1957 ఎన్నికల్లో 371 సీట్లు గెలుచుకుంది. 1984లో 415 సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సీట్లు తగ్గుతూ వచ్చాయే తప్ప.. ఒక్కసీటు కూడా పెరగలేదు. ఇందిరాగాంధీ బతికి ఉన్నప్పుడు ఒంటరిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 1984 తర్వాత పట్టును కోల్పోతూ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ వచ్చింది. 2014లో అయితే 44 ఎంపీ సీట్లే గెలుచుకుంది కాంగ్రెస్. 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. 1951లో 45శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు షేర్.. 2019కి వచ్చేసరికి 19శాతానికి పడిపోయింది.

ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ..
ఎంపీ సీట్లు తగ్గడమే కాదు ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతూ వస్తోంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీశ్‌గఢ్‌లో హస్తం పార్టీ బలంగా ఉండేది. లేటెస్ట్గా ఈ మూడు రాష్ట్రాలను చేజార్చుకుంది. రాజస్థాన్‌లో 1972వరకు వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. 1977 నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య అధికార మార్పిడి జరుగుతుంది. 2018లో వందసీట్లతో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి 70 సీట్లకే పరిమితం అయింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు పార్టీ బలహీనతకు కారణమయ్యాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య రాజకీయంగా పొసగకపోవడంతో పాటు జ్యోతిరాధిత్య సింధియా వంటి లీడర్లు బీజేపీలోకి పోవడం కాంగ్రెస్ బలహీనతకు కారణమయ్యాయి.

పీక్ లెవల్‌లో కుమ్ములాటలు 
ఇక మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లోనూ కుమ్ములాటలు పీక్ లెవల్‌లో ఉన్నాయి. సీనియర్ నేత కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌ది చెరోదారి. 1967 వరకు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే అధికారం. ఆతర్వాత బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 2003 నుంచి అయితే ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో 66 సీట్లకే పరిమితం అయింది కాంగ్రెస్.

ఛత్తీస్‌గడ్‌లో నాలుగుసార్లు ఓడి..
ఛత్తీస్‌గడ్‌లో 2003 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు ఓడిపోయింది కాంగ్రెస్. 2018లో 68 సీట్లలో అధికారంలోకి వచ్చి 2023లో మాత్రం పవర్‌ను నిలబెట్టుకోలేకపోయింది. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టుకోల్పోతూ వచ్చింది. 1982లో మహారాష్ట్రలో 81 శాతంగా ఉన్న హస్తం పార్టీ ఓటు షేర్.. 2019కి వచ్చేసరికి 15 శాతానికి పడిపోయింది. శరద్‌పవార్ కాంగ్రెస్ నుంచి వీడిపోయి.. NCP పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ బలం తగ్గింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో శివసేన ఉద్దవ్, శరద్‌పవార్ ఎన్సీపీతో కలిసి సీట్ల పంపకాల్లో పోటీ చేస్తుంది కాంగ్రెస్.

బెంగాల్‌లో ముగిసిన అధ్యాయం
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి ముగిసిన అధ్యాయంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ వామపక్షాల సొంతమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అప్రతిహతంగా వాళ్లు బెంగాల్‌ను పాలించారు. నాయకుల్లో అవినీతి పెరిగిపోయి ప్రతిష్ట దిగజారిన పరిస్థితిలో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక వెస్ట్ బెంగాల్‌లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. కేరళలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు.

బీహార్‌లో 1990నుంచి కాంగ్రెస్‌ది ప్రతిపక్ష పాత్రే. అంతకముందు ఆ రాష్ట్రంలో ఐదుసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్..ప్రాంతీయ పార్టీల ఎంట్రీ తర్వాత పట్టును కోల్పోతూ వచ్చింది. 1951లో 42శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు షేర్.. 2020కి వచ్చేసరికి 10శాతానికి పడిపోయింది. మహాకూటమితో అధికారాన్ని పంచుకున్నా ఎక్కువ రోజులు నిలబడలేదు.

ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలు
1989 నుంచి ఉత్తరప్రదేశ్‌లో అపోజిషన్ పాత్రనే పోషిస్తుంది కాంగ్రెస్. 1985 వరకు 40 శాతం ఓట్లతో బలంగా కనిపించిన హస్తం పార్టీ.. ఇప్పుడు 3శాతం ఓట్లకు పడిపోయింది. 403 ఎమ్మెల్యే సీట్లున్న యూపీలో.. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. 1952లో 388 సీట్లతో యూపీని పాలించిన కాంగ్రెస్‌కు.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కనీస ప్రాబల్యం కూడా లేకుండాపోయింది.

ఒడిశాలో 1995వరకు కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి అపోజిషన్ బెంచ్‌కే పరిమితం అవుతూ క్రమంగా ఓట్లు.. సీట్లు కోల్పోతూ వస్తోంది.

గుజరాత్‌లో కాంగ్రెస్ ఓట్లు, సీట్లున్నా..అధికారం చేపట్టే స్థాయికి ఎదగలేకపోతుంది. 1998 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోనే ఉండిపోయింది. సీట్ల విషయానికి వస్తే పడుతూ లేస్తూ.. 2022లో 22శాతం ఓటింగ్‌తో కేవలం 17 ఎమ్మెల్యే సీట్లు గెల్చుకుంది.

ఢిల్లీలో తుడిచిపెట్టుకుపోయింది
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేరు. షీలాదీక్షిత్ 1985 నుంచి 2013 వరకు 15ఏళ్ల పాటు కాంగ్రెస్ సీఎంగా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో కంచికే అన్నట్లుగా తయారైంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రె‌స్‌కు కాస్త బలం ఉందనే చెప్పుకోవచ్చు. ఆ స్టేట్‌లో ఓడుతూ గెలుస్తూ వస్తోంది.. 2022లో 40 సీట్లతో పవర్‌లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక హర్యానాలోనూ సేమ్ సిచ్యువేషన్. రెండు టర్మ్‌లు బీజేపీ, రెండు టర్మ్‌లు కాంగ్రెస్..అన్నట్లుగా అధికార మార్పిడి జరుగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ది ఒక చరిత్ర. 2014వరకు కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో తిరుగులేదు. రాష్ట్ర విభజన.. ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి దారుణంగా పడపోయింది. ఒకటి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్‌కు పదేళ్లపాటు ప్రతిపక్ష హోదానే దక్కింది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 2014లో 25శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం ఇప్పుడు 40శాతానికి పెరిగింది.

Also Read: మోదీతో సహా బీజేపీ నేతలందరినీ జైల్లో పెడతాం: లాలూ కుమార్తె వార్నింగ్

1952లో మైసూర్ స్టేట్‌గా ఉన్నప్పటి నుంచి 1978వరకు కర్నాటకలో అధికారంలో కొనసాగుతోంది హస్తం పార్టీ. ఆ తర్వాత. అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. 2023లో జరిగిన ఎన్నికల్లో 135 సీట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతానికి ఇప్పటికి ఓటు శాతం పెరిగినప్పటికి.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయా లేదా అన్న డైలమాలో ఉన్నారు నేతలు.

తమిళనాడులో కాంగ్రెస్‌ది ఎప్పుడూ పొత్తుల సంసారమే. అయితే డీఎంకే లేకపోతే అన్నాడీఎంకేతో పొత్తులతో అధికారం చేపడుతోంది. కేంద్రంలో ఎంపీల మద్దతు తీసుకుంటుంది కాంగ్రెస్.

Also Read: తమిళనాట సరికొత్త రాజకీయం.. బీజేపీని ఢీకొట్టేందుకు పాట్లు పడుతున్న ద్రవిడ పార్టీలు

ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు లేకపోయినా.. ఆ రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అస్సాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, సిక్కింలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇందులో మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి.

1985 తర్వాత కాంగ్రెస్‌కు నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్‌లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్‌లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది. చివరకు యూపీఏ, ఇండియా కూటమి అంటూ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లలోనే పోటీ చేసే పరిస్థితి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు