తమిళనాట సరికొత్త రాజకీయం.. బీజేపీ రూపంలో సీఎం స్టాలిన్‌కు సవాళ్లు!

ఓవైపు బీజేపీ బలమైన క్యాండిడేట్లు బరిలోకి దింపడంతో పాటు.. ప్రధాని మోదీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. డీఎంకే మాత్రం స్టాలిన్, రాహుల్ గాంధీపైనే ఆధారపడింది.

తమిళనాట సరికొత్త రాజకీయం.. బీజేపీ రూపంలో సీఎం స్టాలిన్‌కు సవాళ్లు!

Tamil Nadu Politics: తమిళనాట ఈ సారి ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉన్న పోరు..పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. లోక్‌సభ పోల్స్ రేసులో బీజేపీ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు.. డీఎంకే విధానాలపై విమర్శల దాడి చేస్తూ వెంటాడుతోంది కమలదళం. ఈ నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు డీఎంకేకు సవాల్‌గా మారాయి. బీజేపీని ఢీకొట్టి నిలిచి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు సీఎం స్టాలిన్.

తమిళనాడును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్టాలిన్‌కు చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఏ చిన్న ఇష్యూను కూడా వదలడం లేదు బీజేపీ. ప్రతి అంశంలో డీఎంకేను, స్టాలిన్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తోంది. అయితే పలు అంశాలు స్టాలిన్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్టీ నేతలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు ఇబ్బందిపెడుతున్నాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్‌ను బీజేపీ పాయింట్‌ ఔట్ చేస్తూ వస్తోంది.

ఏమైనా తేడా కొడుతుందేమో..
సరిగ్గా ఎన్నికలకు ముందు కచ్చతీవు ఇష్యూను తెరమీదకు తెచ్చింది బీజేపీ. నిజానికి కచ్చతీవు ద్వీపం తమిళనాడు మత్స్యకారులకు జీవనాధారం. అందుకే ఆ విషయంలో ఏమైనా తేడా కొడుతుందేమోనని స్టాలిన్ టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ హయాంలోనే కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారని.. అలాంటి కాంగ్రెస్‌తో డీఎంకే అంటకాగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. సేమ్‌టైమ్ కచ్చతీవుపై డీఎంకే రెండు నాల్కల ధోరణి అవలంభించిందని ఆరోపిస్తుంది బీజేపీ.

బీజేపీని ఢీకొట్టేందుకు ద్రవిడ పార్టీల పాట్లు
70 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి బీజేపీ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి ద్రవిడ పార్టీలు. ఈ ఎన్నికలు డీఎంకే, అన్నాడీఎంకేకే సవాల్‌గా మారాయి. 39 సీట్లలో మెజార్టీ సీట్లు గెలుచుకుంటేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అయినా గెలుపు ఈజీ అవుతుంది. అందుకే బీజేపీతో పాటు ద్రవిడ పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికారంలో ఉండటం స్టాలిన్‌కు కలిసి వచ్చే అంశమైనా ప్రభుత్వ వ్యతిరేకత.. మోదీ వేవ్.. హిందు సెంటిమెంట్‌ ఇబ్బందికరంగా మారింది. అందుకే ఫస్ట్ టైమ్ ద్రవిడ పార్టీలు బీజేపీని ఢీకొట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి.

బీజేపీతో ఢీ అంటే ఢీ
ఎన్నికల సమరంలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు సీఎం స్టాలిన్. ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తూ డీఎంకేను టార్గెట్‌ చేస్తుంటే స్టాలిన్‌ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. మాటకు మాటే సమాధానంగా పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. డీఎంకే వారసత్వ రాజకీయాలపై బీజేపీ ఫోకస్ చేస్తుంటే.. మోదీ సర్కార్‌ తొమ్మిదేళ్లలో చేసిందేమి లేదంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్.

Also Read: ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలందరినీ జైల్లో పెడతాం: లాలూ కుమార్తె వార్నింగ్

రాహుల్ గాంధీపైనే భారం
ఓవైపు బీజేపీ బలమైన క్యాండిడేట్లు బరిలోకి దింపడంతో పాటు.. ప్రధాని మోదీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. బీజేపీ అ్రగనేతలంతా తమిళనాడులో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. డీఎంకే మాత్రం స్టాలిన్, రాహుల్ గాంధీపైనే ఆధారపడింది. అయితే దేశవ్యాప్తంగా మోదీ వేవ్‌ కారణంగా తమిళనాడులోనూ ఈసారి కాస్త సిచ్యువేషన్ మారే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో స్టాలిన్ అలర్ట్ అయ్యారు. అటు బీజేపీ, ఇటు అన్నాడీఎంకే ను టార్గెట్ చేస్తూ తన పాలనపై ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడుపై బీజేపీ పెత్తనం చేయాలనుకుంటోందని.. హిందీ రాజ్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని ప్రజల్లోకి వెళ్తున్నారు స్టాలిన్.

స్టాలిన్‌కు ప్రభుత్వ వ్యతిరేకత టెన్షన్
మరోవైపు స్టాలిన్‌కు కాంగ్రెస్‌ ఎంత బలమో.. అంతే బలహీనతగా మారింది. ఆ పార్టీ విధానాలను చూపుతూ డీఎంకేను టార్గెట్ చేస్తుంది బీజేపీ. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఎటుదారి తీస్తుందోనని స్టాలిన్‌కు టెన్షన్ పట్టుకుంది. ట్రయాంగిల్ ఫైట్ ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నాడీఎంకే, బీజేపీ చీల్చితే తమకు మేలు జరుగుతుందని భావిస్తోంది డీఎంకే.

Also Read: బీజేపీ తమిళ తంబిల మనసులు గెలుస్తుందా.. సెంటిమెంట్‌ పాచికలు పనిచేస్తాయా?

జాతీయ పార్టీ, పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో టఫ్‌ ఫైట్‌ను ఎదుర్కొంటున్నారు స్టాలిన్. బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందనేది అటుంచితే ఓట్లు చీలి అన్నాడీఎంకేకు అడ్వాంటేజ్‌గా మారితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు స్టాలిన్. ఈ పరిస్థితుల్లో స్టాలిన్‌ గెలిచి నిలవడం ఎంతవరకు సాధ్యమనేది ఆసక్తికరంగా మారింది.