బీజేపీ తమిళ తంబిల మనసులు గెలుస్తుందా.. సెంటిమెంట్‌ పాచికలు పనిచేస్తాయా?

తమిళనాడులో ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే.. పూర్వ బీజేపీకి.. ప్రస్తుత బీజేపీకి చాలా తేడా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వర్సెస్‌ బీజేపీ అన్నట్టు పోటీ నెలకొంది.

బీజేపీ తమిళ తంబిల మనసులు గెలుస్తుందా.. సెంటిమెంట్‌ పాచికలు పనిచేస్తాయా?

BJP Election Game Plan in Tamil Nadu: ప్రాంతీయ ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిన తమిళనాడు జాతీయ పార్టీ రాజకీయాలకు అడుగడుగున అడ్డుపడింది. ఇప్పటి వరకు తమిళనాట ఓపెనింగ్సే లేని బీజేపీ ఈసారి గట్టిదెబ్బ కొట్టాలని ప్లాన్‌ చేస్తోంది. సంప్రదాయ ద్రవిడ ఓట్లు తమవైపు తిప్పుకొని కమలం జెండా పాతేందుకు ఎత్తులు వేస్తోంది. తమిళ తంబిల మనసులు గెలిచేందుకు సెంటిమెంట్‌ పాచికలు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రధాని మోదీ సైతం ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ మోదీ వేవ్‌ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 19న రాష్ట్రంలోని 39 స్థానాలకు పోలింగ్‌ జరుగనుండటంతో మోదీ తన వరుస పర్యటనలు, సెంటిమెంట్‌ ప్రసంగాలతో పొలిటికల్‌ హీట్‌ పెంచారు.

1989 నుంచి తమిళనాడులో అయితే డీఎంకే.. లేదంటే అన్నాడీఎంకే పార్టీలదే హవా. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీలు సైతం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే.. తమిళనాట కాంగ్రెస్‌కు లభించిన ఆదరణ బీజేపీకి దొరకలేదు. తొలి నుంచి డీఎంకే ఎక్కువకాలం యూపీఏతో దోస్తీ చేసింది. అన్నాడీఎంకే ఒకసారి బీజేపీకి మద్దతు ఇస్తూ.. మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది. అయితే.. ఈ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్‌ కట్టిన ఇండియా కూటమిలో కీలకంగా ఉండగా.. అన్నాడీఎంకే మాత్రం సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అవకాశంగా భావించిన బీజేపీ తమిళనాడులో తన పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్‌ ఆన్‌ చేసింది.

మోదీ వరుస పర్యటనలు
తమిళనాడులో బీజేపీ 1999లో తొలిసారి 4 సీట్లు సాధించింది. అయితే.. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఈ సారి మాత్రం 39 సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి రెండోస్థానంలో నిలిచేందుకు కష్టపడుతోంది. ఇందుకు కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసి అమలు చేస్తోంది బీజేపీ. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో మోదీ తమిళనాడులో వరుస పర్యటనలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. గడిచిన 60 రోజుల్లోనే ఆరుసార్లు ఆయన తమిళనాడులో పర్యటించారు.

పనీర్‌ సెల్వంకి బీజేపీ మద్దతు
ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకేల మధ్య త్రిముఖ నెలకొంది. ఇందులో ఇండియా కూటమిలోని డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్‌ 9 స్థానాల్లో, వామపక్షాలు 4, ఇతర పార్టీలు 4 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. ఇక ఎన్డీఏ విషయానికొస్తే.. 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ.. 10 స్థానాలు తాము పొత్తు పెట్టుకున్న పీఎంకే పార్టీకి కేటాయించింది. ఇతర పార్టీలకు 8 స్థానాలు కేటాయించి.. స్వతంత్రుడిగా బరిలోకి దిగుతున్న పనీర్‌ సెల్వంకి మద్దతు ప్రకటించింది బీజేపీ. అయితే.. తమిళనాడులోని యువత ఓటుబ్యాంకునే నమ్ముకొని ముందుకెళ్తోంది. దీనికి తోడు ఇటీవలే అన్నాడీఎంకే నుంచి 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. గడిచిన పదేళ్లతో పోల్చితే తమిళనాట బలం పెంచుకున్న బీజేపీ టార్గెట్‌ 400 రీచ్‌ అయ్యేందుకు తమిళనాడులోనే ప్రయోగించేందుకు ప్రత్యేక అస్త్రశస్త్రాలు బయటకు తీయనుంది.

తెరపైకి కచ్చతీవు వివాదం
ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ హయాంలో శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీజేపీ. తమిళనాడులోని రామేశ్వరం దీవి ద్వారా భారత్‌ను శ్రీలంకను వేరు చేస్తున్న ఈ దీవి ఇందిరాగాంధి హయాంలో 1974లో అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేకి అప్పగించారు. కాగా.. ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా భారత్‌లోని ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఎలా అప్పగిస్తారంటూ ఒక వాదన తెరపైకి తెచ్చింది బీజేపీ. 1974 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇదొక మేనిఫెస్టో అంశంగా ఉండేది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాల దాడులపై కూడా తీవ్రంగా చర్చ జరిగేది. అయితే.. ఎన్నికలకు ముందు బీజేపీ కచ్చతీవు అంశాన్ని తెరపైకి తేవడంతో సెంటిమెంట్‌ రగిలించినట్టయింది. వివాదానికి కేంద్రబిందువైన కచ్చతీవును తిరిగి భారత్‌ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ బలపడేలా గేమ్‌ ప్లాన్‌ చేసింది.

సెంటిమెంట్‌ రాజకీయాలు
మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో తమిళ-కాశీ సంఘం వారోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం మోదీ సెంగోలు అనే రాజదండాన్ని ప్రత్యేకంగా పట్టుకున్నారు. అది చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్‌ షా ఎప్పటికైనా తమిళుడిని ప్రధానిగా చూడాలని ఉంది అని కామెంట్‌ చేశారు. ఇవన్నీ డీకోడ్‌ చేస్తే బీజేపీ తమిళనాట సెంటిమెంట్‌ రగిల్చే రాజకీయాలు చేస్తోందని వాదిస్తున్నాయి విపక్షాలు.

దూకుడు పెంచిన బీజేపీ
తమిళనాడులో ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే.. పూర్వ బీజేపీకి.. ప్రస్తుత బీజేపీకి చాలా తేడా ఉంది. డీఎంకే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వీడియోలతో దాడి చేస్తూ దూకుడు పెంచింది. మరోవైపు డీఎంకే కూడా బీజేపీ టార్గెట్‌గా పనిచేస్తోంది. దీంతో.. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వర్సెస్‌ బీజేపీ అన్నట్టు పోటీ నెలకొంది. 39 లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు డీఎంకే గెలిచినా.. బీజేపీ రెండో స్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.