మోదీని జైల్లో పెడతామన్న లాలూ కుమార్తె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే నరేంద్ర మోదీతో సహ బీజేపీ నాయకులను జైలుకు పంపడం ఖాయమని లాలూ ప్రసాద్ చిన్న కుమార్తె మిసా భారతి అన్నారు.

మోదీని జైల్లో పెడతామన్న లాలూ కుమార్తె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ

Misa Bharti: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులందరినీ జైలులో పెట్టడం ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకురాలు మిసా భారతి చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు మరింత దిగజారి మాట్లాడుతున్నాయని విమర్శించింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. లాలూ ప్రసాద్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దృష్టి సారించాలని హితవు పలికింది.

లాలూ ప్రసాద్ చిన్న కుమార్తె అయిన మిసా భారతి.. బిహార్‌లోని పాటలీపుత్ర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చినందుకు ప్రధాని మోదీపై ఆమె కామెంట్స్ చేశారు. “మేము 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడం, రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచడం, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఆయన (పీఎం మోదీ) బిహార్ వచ్చినప్పుల్లా మా కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని మాట్లాడుతున్నారు. భారత కూటమికి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దేశ ప్రజలు అవకాశం ఇస్తే.. ప్రధాని మోదీ నుంచి మొదలుకొని, బీజేపీ నేతలందరూ కటకటాల వెనుక ఉంటార”ని మిసా భారతి అన్నారు.

పూర్తిగా దిగజారిపోయారు: వినోద్ తవాడే
మిసా భారతి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే స్పందించారు. ”ఉగ్రవాదులను, అవినీతికి పాల్పడిన వారిని జైల్లో పెడతామని చెప్పకుండా.. ప్రతిపక్షాలు ప్రధానిపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల ప్రచార స్థాయి పూర్తిగా దిగజారింది. మోదీజీని జైల్లో పెడతామని లాలూజీ కుమార్తె ఆర్జేడీకి చెందిన మిసా జీ అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నాయకులను జైలుకు పంపడం, చావుల గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నార”ని దుయ్యబట్టారు.

Also Read: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు.. రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

మీ సంగతి చూసుకోండి: ఫడ్నవీస్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మిసా భారతి వ్యాఖ్యలపై స్పందించారు. తమను వేలెత్తి చూపే ముందు, మీ కుటుంబ అవినీతి గురించి తెలుసుకోవాలని సూచించారు. ”ఇలాంటి వాళ్లు చాలా రకాల కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయారు. ఇవి మేము చేస్తున్న ఆరోపణలు కాదు. వారు అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించి కోర్టులే శిక్ష విధించాయి. ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం మానుకోవాలని వారికి సలహాయిస్తున్నాన”ని ఫడ్నవీస్ అన్నారు.

Also Read: ఆప్‌ కోటకు బీటలు.. కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్న నేతలు