ఆప్‌ కోటకు బీటలు.. కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీని వీడుతున్న నేతలు

లిక్కర్‌ కేసు మనీలాండరింగ్‌ వ్యవహారం ఆప్‌ను కుదిపేస్తోంది. ఎమ్మెల్యేలు, పలువురు ఆప్‌ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.

ఆప్‌ కోటకు బీటలు.. కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీని వీడుతున్న నేతలు

Aam aadmi party crisis: ఇప్పటికే ఈడీ కేసులతో కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి.. రాజకీయంగా మొదటి షాక్ తగిలింది. ఆప్‌ పార్టీ నేత ఢిల్లీ సంక్షేమ శాఖమంత్రి రాజ్‌కుమార్ ఆనంద్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన మంత్రిపదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్‌కుమార్ ఆనంద్. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

ఆ పార్టీలో ఉండటం వృథా
ఆప్‌ నుంచి బయటకు వెళ్తూ ఆ పార్టీపైనా, సీఎం కేజ్రీవాల్‌పైనా విమర్శలు చేశారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆప్‌, అవినీతిలో పాలుపంచుకున్న పార్టీగా పతనమైందని అన్నారు. అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసి తాను ఆప్‌లో చేరానన్నారు. కానీ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని.. తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు రాజ్‌కుమార్‌ ఆనంద్‌. ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు రాజ్‌కుమార్. దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అని అన్నారు.

భయపడి రిజైన్‌ చేశారు
రాజ్‌కుమార్ రాజీనామాపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాజీనామా చేసినందుకు నిజాయితీ లేని వాడని, మోసగాడని విమర్శించబోమన్నారు. ఈడీ బెదిరింపులకు భయపడి రాజ్‌కుమార్‌ రిజైన్‌ చేసి ఉంటారన్నారు సౌరభ్ భరద్వాజ్. ఆప్‌ పార్టీని లేకుండా చేయడానికే బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు.

Also Read: సంపన్న లోక్‌స‌భ‌ అభ్యర్థి ఎవరో తెలుసా.. ఆయన ఆస్తులు ఎన్ని వందల కోట్లు అంటే?

మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామాపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్ స్పందించారు. తమ పార్టీని అంతం చేసే ఉద్దేశ్యంతోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారన్నారు.. ఈడీ, సీబీఐని ప్రయోగించి తమ మంత్రులను, ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చుతుందని.. ఇది తమకు పరీక్షలాంటిదన్నారు. అవినీతిపరుడని పిలిచిన బీజేపీలోనే రాజ్‌కుమార్ చేరబోతున్నారంటూ విమర్శించారు.

Also Read: అమిత్ షాను కలిస్తే తప్పేంటి.. ఆ విషయం చెప్పిన మొదటి వ్యక్తిని నేనే: రాజ్ ఠాక్రే

బీజేపీతో టచ్‌లోకి ఆప్‌ నేతలు!
లిక్కర్‌ కేసు మనీలాండరింగ్‌ వ్యవహారం ఆప్‌ను కుదిపేస్తోంది. కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీశ్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌లు ఈ కేసులో జైలుకెళ్లారు.. ఇటీవలే సంజయ్ బెయిల్‌పై బయటకు వచ్చారు. మరో కీలక నేత సత్యేందర్ జైన్ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. అలాగే అవినీతి ఆరోపణల కింద పలువురు నేతలకు దర్యాప్తు సంస్థలు సమన్లు ఇస్తున్నాయి. ఈ సమయంలో కేబినెట్‌ మంత్రి రిజైన్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు, పలువురు ఆప్‌ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.