సీఎం చెప్పారు.. అందుకే అమిత్ షాను కలిశాను: రాజ్ ఠాక్రే

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం చెప్పారు.. అందుకే అమిత్ షాను కలిశాను: రాజ్ ఠాక్రే

Raj Thackeray on Amit Shah: మహారాష్ట్రలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు కుస్తీ పడుతున్న ఎన్డీఏ కూటమికి రాజ్ ఠాక్రే రూపంలో బూస్ట్ లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి వెళ్లి స్వయంగా అమిత్ షాను కలిసి మరీ మద్దతు ప్రకటించారు రాజ్ ఠాక్రే. ఆయన నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు కూడా.

అలా చెప్పిన మొదటి వ్యక్తిని నేనే
మహారాష్ట్ర నూతన సంవత్సరం గుడి పడ్వా సందర్భంగా మంగళవారం ముంబైలో నిర్వహించిన వేడుకల్లో నవనిర్మాణ సేన కార్యకర్తలను ఉద్దేశించి రాజ్ ఠాక్రే మాట్లాడారు. గత నెలలో హోం మంత్రి అమిత్ షాతో తన సమావేశం గురించి ప్రస్తావించారు. ఏక్‌నాథ్ షిండే చెబితేనే అమిత్ షాను కలిశానని ఆయన వెల్లడించారు. “నేను వెళ్లి హోం మంత్రిని కలిస్తే తప్పేంటి? మనమంతా కలిసివుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోరారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నాతో మాట్లాడారు. అందుకే అమిత్ షాను కలిశానని రాజ్ ఠాక్రే తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రధాని కావాలని చెప్పిన మొదటి వ్యక్తి తానేనని గుర్తు చేశారు.

దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి
ఎటువంటి షరతులు లేకుండానే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టు రాజ్ ఠాక్రే చెప్పారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరమన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. యువ జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని.. యువతకు సరైన విద్య, ఉపాధి కల్పించాలని.. అది జరగకపోతే దేశంలో అరాచకం పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ క్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించే సత్తా నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు.

Also Read: కొడుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంపై కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెడతారా లేదా అనేది రాజ్ ఠాక్రే స్పష్టం చేయలేదు. ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని తన కేడర్‌కు రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతు, సీట్లలో వాటా ఆశిస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.

Also Read: సంపన్న లోక్‌స‌భ‌ అభ్యర్థి ఎవరో తెలుసా.. ఆయన ఆస్తులు ఎన్ని వందల కోట్లు అంటే?